వీఆర్ఏల వినతిపత్రం విసిరికొట్టిన కేసీఆర్

వరంగల్ :  డిమాండ్లు నెరవేరుస్తారేమోననే ఆశతో సీఎం కేసీఆర్ ను కలిసిన వీఆర్ఏ సంఘం నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. వినతులు ఆలకిస్తారనుకున్న ముఖ్యమంత్రి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతిపత్రాన్ని వీఆర్ఏ సంఘం నాయకులపైకి విసిరారు. ‘‘డ్రామాలాడుతున్నరా.. మీరు అనవసరంగా సమ్మె చేస్తున్నరు. మీకేం పనిలేదా ?’’ అంటూ కోపాన్ని వెళ్లగక్కారు. ఈ ఘటన హన్మకొండలోని టీఆర్ఎస్ సీనియర్ నేత, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో చోటుచేసుకుంది. 

వరంగల్ పర్యటనను ముగించుకున్న సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి బయలుదేరే ముందు హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వచ్చారు. ఈవిషయాన్ని తెలుసుకున్న వీఆర్ఏ సంఘం నాయకులు ఆయనను కలిసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేసీఆర్ కి వినతి పత్రం అందించారు.  తమ సమస్యలను సీఎంకు వివరించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసి, వినతిపత్రాన్ని విసిరేయడంతో వారు ఆవేదనకు లోనయ్యారు. ‘‘డ్రామాలాడుతున్నారా’’ అని సీఎం తమపై కోపగించుకున్నారని తెలిపారు. 

వీఆర్ఏ సంఘం నాయకుల కథనం ప్రకారం.. ‘‘ వరంగల్ నగరంలో ప్రతిమ హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత సీఎం కేసీఆర్ హన్మకొండకు వస్తుండగా మార్గం మధ్యలో మేం ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపాం. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ మా వినతిపత్రం తీసుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మేం అక్కడికి కూడా వెళ్లి టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుమారుడు, ఎమ్మెల్యే సతీశ్ ద్వారా సీఎం కేసీఆర్ ను కలిసేందుకు అనుమతి పొందాం. అక్కడ మళ్లీ మేం సీఎం కేసీఆర్ కు వినతిపత్రం ఇస్తే.. మీరు అనవసరంగా సమ్మె చేస్తున్నారని ముఖం మీదికి విసిరేశారు’’  అని తెలిపారు. 

అంతకుముందు సీఎం కేసీఆర్ వరంగల్ నగరంలోని ములుగు రోడ్డులో ప్రతిమ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని ప్రారంభించారు.  తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ వన్ గా ఉందన్న సీఎం... వైద్య విద్య కోసం విద్యార్థులు చైనా, ఉక్రెయిన్ కు వెళ్లాళ్సిన అవసరం లేదన్నారు.  సరిపడా మెడికల్ సీట్లు రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు.  రాష్ట్రంలో ఇప్పటికే 6,500 మెడికల్  సీట్లుండగా,అన్నీ పూర్తయితే 10 వేలకు పైగా సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.