దళితబంధు ఇచ్చేందుకు లంచాలు తీసుకోవడమేంది?..నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం

  • దళితబంధు ఇచ్చేందుకు లంచాలు తీసుకోవడమేంది?
  • ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు.. చిట్టా అంతా ఉంది
  • ‘నీ పని నువ్వు చేస్కో’ అంటూ నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ ప్రతినిధుల సభలో ఎమ్మెల్యేల వ్యవహారంపై ఎక్కువ సేపు మాట్లాడారు. దళితబంధు, డబుల్​బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ఎవరేం చేస్తున్నారో తనకు తెలుసని, దళితబంధు ఇవ్వడానికి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి చిట్టా తన దగ్గర ఉందని, తీరు మారకపోతే తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. తమ అనుచరులు వసూలు చేసినా ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. బాగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తామని, ఇప్పటికీ మారకపోతే చేసేదేమీ లేదన్నారు. దళితులు అన్నింటా వెనుకబడిపోయారని రూ.10 లక్షల సాయం చేస్తుంటే అందులో లంచాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అక్టోబర్‌‌లోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మారని వారికి నష్టం తప్పదని హెచ్చరించారు.

తలకాయ లేనోళ్లు మాట్లాడితే స్పందిస్తవా?

మంత్రి నిరంజన్​రెడ్డిపైనా కేసీఆర్​తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దారినపోయే వాళ్లు రాళ్లు వేస్తే.. తలకాయ లేని వాళ్లు మాట్లాడితే స్పందిస్తవా? ప్రెస్​మీట్​పెట్టి కౌంటర్​ఇస్తావా? నీ పని నువ్వు చేస్కో. ఎవరి మీద ఎవరు మాట్లాడినా పట్టించుకోవద్దు” అని అన్నారు. ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లు వ్యక్తిగత ప్రతిష్ట కోసం పార్టీని ఇబ్బంది పెట్టొద్దన్నారు. స్టేషన్​ఘన్​పూర్​లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒకరిపై ఒకరు మాట్లాడి పలుచన కావొద్దని, పార్టీని పలుచన చేయొద్దన్నారు. ఇదే పరిస్థితి ఇంకొన్ని నియోజకవర్గాల్లోనూ ఉందని, వాళ్లందరూ పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు. 

తేడాలొస్తే చర్యలు తప్పవు

‘‘సొంత జాగాల్లో ఇండ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఇచ్చే గృహలక్ష్మి పథకం, దళితబంధు, గొర్రెల పంపిణీ, పోడు భూముల పట్టాలు, 58, 59 జీవోల ప్రకారం క్రమబద్ధీకరణ.. పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలు. వాటిపై క్రమశిక్షణతో వ్యవహరించాలి. ఇందులో ఎలాంటి తేడాలు రానివ్వొద్దు. వస్తే కఠిన చర్యలుంటాయి” అని హెచ్చరించారు. పేదలకు పంచేందుకు గతంలో జాగాలు సమీకరించి ఉంటే వాటిని వెంటనే పంపిణీ చేయాలన్నారు. హైదరాబాద్‌లో నోటరీ భూములను కూడా క్రమబద్ధీకరిద్దామని, కొత్త సెక్రటేరియెట్‌లో ఈ ఫైళ్లపై  సంతకం చేస్తానని తెలిపారు. ఎన్ని కష్టాలొచ్చినా దళితబంధు పథకం కొనసాగుతూనే ఉంటుందన్నారు.

పార్టీ ఖాతాలో రూ.1,250 కోట్లు

​పార్టీ ఖాతాలో రూ.1,250 కోట్ల నిధులున్నాయని కేసీఆర్ చెప్పారు. ఇందులో రూ.767 కోట్లు డిపాజిట్ చేశామని, తద్వారా నెలకు రూ.7 కోట్ల వడ్డీ వస్తున్నదని, ఆ మొత్తంతో పార్టీని నడపడం, జిల్లాల్లో ఆఫీసుల నిర్మాణాలు, ప్రచారం, వసతుల కల్పన కోసం ఖర్చులు చేస్తున్నామన్నారు. పార్టీ ఆర్థిక వ్యవహారాలపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ ఆర్థిక వ్యవహారాలను అధ్యక్షుడే చూసుకుంటారని, ఇతర రాష్ట్రాల్లో ఖాతాలు తెరవడం, ప్రచారం కోసం దేశవ్యాప్తంగా మీడియా వ్యవస్థల ఏర్పాటు, ఇతర వ్యవహారాలను పార్టీ జాతీయ అధ్యక్షునికి కట్టబెడుతూ తీర్మానం చేశారు.

4న ఢిల్లీలో బీఆర్ఎస్ సెంట్రల్​ ​ఆఫీస్​ ప్రారంభం

ఢిల్లీలోని వసంత విహార్‌‌లో నిర్మించిన బీఆర్ఎస్​ కేంద్ర కార్యాలయాన్ని మే 4న ప్రారంభించుకుందామని కేసీఆర్​ తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని ఆహ్వానించారు. జూన్ ఒకటిన అమరుల స్మారకాన్ని ఆవిష్కరిస్తామని, 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు. గుణాత్మక రాజకీయాలతో ట్రెండ్ సెట్ చేయడం కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేశామని, దేశానికి వెలుగు దివ్వెగా పార్టీని ముందుకు తీసుకుపోదామన్నారు.