కేసీఆర్ వారంటీ పీరియడ్ ​పూర్తయ్యింది : జైరాం రమేశ్

కరీంనగర్, వెలుగు :  కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో కేసీఆర్ వారంటీ పీరియడ్ పూర్తయిందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. తెలంగాణ వచ్చాక తొమ్మిదేళ్లలో మహిళలు, యువకులు, మైనార్టీలకు కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్​ప్రజాసమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి ఔటర్ రింగ్ రోడ్డు దాటలేదని, కరీంనగర్‌‌‌‌ను లండన్ చేస్తాననే హామీని సీఎం మరిచిపోయారని మండిపడ్డారు.  ఉస్మానియా, కాకతీయ లాంటి అనేక యూనివర్సిటీల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేవని తెలిపారు. నిరుద్యోగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో సీఎం తొమ్మిదేళ్లుగా కూర్చోవడం లేదని, ఫామ్‌‌హౌస్‌‌కే పరిమితమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని  సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.

కాంగ్రెస్ సీఎం డిసెంబర్ 9న సెక్రటేరియట్ ‌‌నుంచి పాలన చేయబోతున్నారని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు కొత్త శక్తి వచ్చిందని, ఆ యాత్రతోనే కర్నాటకలో గెలిచామని గుర్తు చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు  కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధులు మేనేని రోహిత్ రావు, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.