- గతంలో ఎప్పుడొచ్చినా ‘కెప్టెన్’ నివాసంలోనే అతిథ్యం
- ఈటల ఎపిసోడ్ నేపథ్యంలో సీఎం సరికొత్త నిర్ణయాలు
- ప్రభుత్వంలో శ్రీహరికి మళ్లీ మంచి రోజులనే గుసగుస
వరంగల్ రూరల్, వెలుగు: సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ అనగానే గుర్తొచ్చేది రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసం. 20 ఏళ్ల కింద ఉద్యమ సమయంలో.. ఇప్పుడు సీఎం అయ్యాక కూడా కేసీఆర్ ఉమ్మడి వరంగల్ పర్యటనకు వచ్చారంటే హంటర్ రోడ్డులోని కెప్టెన్ ఇంట్లో దిగాల్సిందే. లంచ్ అయినా.. డిన్నర్ అయినా..చివరకు ఒక రోజు బస చేయాలన్నా అక్కడే ఉండేవారు. సీఎం గత నెల 21న ఎంజీఎం విజిట్ సందర్భంలోనూ కెప్టెన్ ఇంట్లోనే ఉన్నారు. అలాంటిది ఈ పర్యటనలో సరికొత్త చిత్రం కనపడబోతోంది. ఎన్నడూలేని విధంగా కేసీఆర్.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంట్లో లంచ్ చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు సీనియర్ లీడర్‍గా, వివిధ శాఖల్లో మంత్రిగా ఎంతో అనుభవమున్న కడియంకు రెండు మూడేండ్లుగా పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ గులాబీ పెద్దలు ఇంపార్టెన్స్ తగ్గిస్తూ వచ్చారు. ఈ మధ్యనే శ్రీహరి ఎమ్మెల్సీ పదవీకాలం సైతం ముగిసింది. ఇలాంటి సమయంలో సోమవారం వరంగల్ పర్యటన సందర్భంగా కేసీఆర్ కడియం ఇంట్లో ఆతిథ్యం స్వీకరించనున్నారు. ఇప్పుడిదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. రాబోయే రోజుల్లో పార్టీలో, పదవుల్లో, జిల్లా రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయోననే డిస్కషన్ మొదలైంది.
పార్టీ డైరెక్షన్.. ఈటలపై కడియం ఫైర్
పార్టీ డైరెక్షన్‍లోనే కడియం శ్రీహరి ఈ నెల 15న హోటల్ హరిత కాకతీయలో ప్రెస్‍మీట్ పెట్టి ఈటల బీజేపీలో చేరడంపై విమర్శలు చేశారు. కమ్యూనిస్ట్ కాస్తా ఫ్యూడలిస్ట్ అయ్యాడంటూ దెప్పిపొడిచారు. ఇది జరిగాక ఐదు రోజులకే సీఎం వరంగల్ టూర్ వస్తున్నారు. కడియం ఇంట్లో లంచ్‍కి రెడీ అయ్యారు. దీంతో శ్రీహరికి తిరిగి ప్రాధాన్యతగల పదవి ఖాయమన్న చర్చ ఓరుగల్లు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.