మూడు టిమ్స్ ఆస్పత్రులకు భూమి పూజ చేయనున్న కేసీఆర్

ఇవాళ  హైదరాబాద్ లో పలు చోట్ల పర్యటించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సిటీలో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమి పూజ చేయనున్నారు సీఎం. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో  3 హాస్పిటళ్లకు నిర్మాణానికి ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే వీటి నిర్మాణానికి 2 వేల 679 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలు వైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖాలను నిర్మిస్తోంది సర్కార్. అల్వాల్, ఎల్బీనగర్, సనత్ నగర్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేస్తోంది. ఉదయం 11.30 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డి అన్నారంలో భూమి పూజ చేయనున్నారు కేసీఆర్. అక్కడి నుంచి సనత్ నగర్ వెళ్లనున్నారు. చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అల్వాల్ ల్లో హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు కేసీఆర్. తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం టూర్ కు భారీ ఏర్పాట్లు చేశారు అధికార పార్టీ నేతలు. ప్లెక్సీలు, టీఆర్ఎస్ జెండాలతో సిటీ సర్కిళ్లను నింపేశారు. 

ఎల్బీనగర్ లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ప్రభుత్వం 900 కోట్లు కేటాయించింది. సనత్ నగర్ లో నిర్మించే దవాఖానాకు 882 కోట్లు కేటాయించింది. అల్వాల్ లో నిర్మించే ఆస్పత్రికి 897 కోట్లు కేటాయించింది. గ్రేటర్ చుట్టూ నిర్మిస్తున్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలకు వైద్య సేవలు అందనున్నాయి. ముఖ్యంగా అల్వాల్-ఔటర్ రింగ్ రోడ్డు మధ్య నిర్మిస్తున్న ఆస్పత్రితో సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందనున్నాయి. ఎల్బీనగర్ గడ్డిఅన్నారంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నల్లగొండ, వరంగల్, యాదాద్రి జిల్లాల ప్రజలకు ఉపయోగపడనుంది. గచ్చిబౌలిలోని టిమ్స్ తో రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ప్రజలకు ఉపయోగపడనుంది. జిల్లాల నుంచి వచ్చే ప్రజలు ఉస్మానియా, గాంధీకి వెళ్లకుండా శివారులోనే వైద్యం అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.

 సీఎం కేసీఆర్ టూర్ తో చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు పెట్టారు పోలీసులు. అల్వాల్  రైతు బజార్  ఎదురుగా ఉన్న స్థలంలో టిమ్స్  ఆసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కార్యక్రమం ఉండడంతో తిరుమలగిరి చౌరస్తా – బొల్లారం చెక్  పోస్టు మధ్య ట్రాఫిక్   ఇబ్బందులు రాకుండా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా వాహనదారులు ఈ రూట్లో రావొద్దని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

ఇక కరీంనగర్  హైవేకు వెళ్లే వారు ఔటర్  రింగ్  రోడ్  లో వెళ్లాలని ట్రాఫిక్  పోలీసులు సూచిస్తున్నారు. సీఎం టూర్ ఉండడంతో చాలా రూట్లలో ట్రాఫిక్  మళ్లించడమో, పూర్తిగా ఆపడమో జరుగుతుందన్నారు పోలీసులు. JBS నుంచి కరీంనగర్  హైవే మధ్య ఉన్న టివోలీ ఎక్స్  రోడ్స్, హోలీ ఫ్యామిలీ జంక్షన్ నుంచి ట్రాఫిక్  ను డైవర్ట్ చేయనున్నారు. కరీంనగర్  హైవే నుంచి హైదరాబాద్  సిటీలోకి వచ్చే రూట్లో షామీర్  పేట ఓఆర్ ఆర్, బిట్స్  జంక్షన్, తూముకుంట ఎన్డీఆర్  విగ్రహం, బొల్లారం చెక్ పోస్టు నుంచి ట్రాఫిక్  మళ్లింపులు ఉండనున్నాయి. పబ్లిక్ వీటిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరుతున్నారు ట్రాఫిక్  పోలీసులు.