వ్యతిరేక తుపానును కేసీఆర్​ అధిగమించేనా?

వ్యతిరేక తుపానును కేసీఆర్​ అధిగమించేనా?

‘పర్ఫెక్ట్ స్టార్మ్’ 2000 సంవత్సరంలో విడుదలైన ప్రముఖ హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ నటించిన ఒక విజయవంతమైన ఇంగ్లిష్​ సినిమా. ఈ సినిమా కథ ప్రాథమికంగా సముద్రంలో నౌక ప్రయాణం గురించి. ఈ నౌక మునుపెన్నడూ లేని విధంగా సముద్రంలో భీకరమైన తుపానును ఎదుర్కొంటుంది. తుపాను ధాటికి సాధారణంగా ఓడ మునిగిపోయే అవకాశాలే ఎక్కువ. నౌక  ప్రమాదానికి అత్యంత చేరువలో ఉంటుంది. కానీ, జార్జ్ క్లూనీ తన ఓడను తుపాను నుంచి సమర్థవంతంగా  రక్షిస్తాడు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల తుపానులో కూడా అలాంటి పర్ఫెక్ట్ స్టార్మ్‌‌‌‌ని కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. ఎంతో రాజకీయ చతురత గల బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ ఊహించని విధంగా రాజకీయ వాతావరణం నెలకొంది. ఇలాంటి  పర్ఫెక్ట్ రాజకీయ తుపాను వస్తుందని  ఆయన ఊహించి ఉండకపోవచ్చు. 


2018 నాటి ఎన్నికల్లో ఎదురు లేకుండా దూసుకుపోయిన తమ  కారు పరిస్థితులు ప్రస్తుతం కూడా ఉంటాయని కేసీఆర్ భావించి ఉండవచ్చు. కేసీఆర్​ ముంగిట రెండు సమాధానాలు ఉన్నాయి.  ఒకటి ఓటమి లేదా రెండోది విజయం మాత్రమే ఉంటుంది. ఈ రెండు కాకుండా బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్‌‌‌‌కు మధ్యేమార్గం ఉండదు.

కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం

దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు తన  పార్టీ ఎంపీలను పంపడమే కేసీఆర్ చేసిన పెద్ద వ్యూహాత్మక తప్పు. దీంతో రాజకీయ వర్గాల్లో కేసీఆర్ తీవ్ర నిరాశకు లోనయ్యారనే భావన ఏర్పడింది. మరోవైపు కేసీఆర్​ కాంగ్రెస్ సాయం కోరుతున్నారనే వాదం కూడా ఏర్పడింది. ఈ అనాలోచిత చర్య తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ బలోపేతానికి సహాయం చేసింది. కేసీఆర్‌‌‌‌ కాంగ్రెస్​ పార్టీ తలుపు వద్ద ఉన్నట్లు  చిత్రీకరించారు.  కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్​కు చెందిన ఎంపీలంతా కాంగ్రెస్ నేతలు, గాంధీలతో ఉన్న ఆ ఫొటోలు కేసీఆర్ ఎత్తును చిత్తు చేశాయి. కాంగ్రెస్​ పార్టీ ఎంపీలకు మద్దతుగా నిలవాలని తీసుకున్న నిర్ణయం వ్యతిరేక ఫలితాన్నిచ్చింది. కేసీఆర్​కు ఈ విధానం అవలంబించాలని ఎవరు సలహా ఇచ్చారో కానీ దానికి మూల్యం చెల్లించుకోక తప్పేలా లేదు. 

బలంగా కాంగ్రెస్, పటిష్టంగా బీజేపీ  

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టడం హస్తం పార్టీ నేతల్లో నైతిక స్థైర్యాన్ని నింపింది.  కర్నాటక విజయం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అమెరికా నుంచి ధనవంతులైన అభ్యర్థులను, ఎన్నారైలను కూడా కాంగ్రెస్ ఆకర్షించడం ప్రారంభించింది. ధనవంతులు స్వభావరీత్యా లాభాన్ని ఆశిస్తారు. తాము చేసే పనిలో లాభాన్ని గ్రహించినప్పుడే వారు పెట్టుబడి పెడతారనేది వాస్తవం. కాగా,  పది ఏండ్లపాటు ప్రభుత్వం పాలించిన తర్వాత ప్రజల్లో వచ్చే సహజమైన ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంటుంది. పైగా  ముఖ్యమంత్రి కేసీఆర్, టీమ్‌‌‌‌ని మార్చుకోని ఆయన మంత్రులు, సర్కిల్‌‌‌‌పై కూడా అదేస్థాయిలో వ్యతిరేకత ఉంటుంది. రాష్ట్ర  ప్రజలు రోజూ ఒకే లీడర్ల ముఖాలను పదేపదే చూసి విసుగెత్తుతారు. ఈ పరిస్థితి రాజకీయాల్లో చాలాకాలంగా ఉన్నదే.  ఈ పాత పరిస్థితిని సదవకాశంగా తీసుకోవడంతో కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి లబ్ధి చేకూరి ఆ పార్టీకి నేతల్లో మనోధైర్యం​పెరిగింది.  బీజేపీ రాష్ర్టంలో గణనీయంగా తన ఉనికిని పెంచుకుంది. తమ ఉనికిని పెంచుకునే క్రమంలో కమలనాథులు  కేసీఆర్‌‌‌‌పై మాటల తూటాలు పేల్చారు.  కానీ, లబ్ధి పొందినది మాత్రం కాంగ్రెస్. అయితే బీజేపీ తన పునాదిని పటిష్టం చేసుకున్నదనేది వాస్తవం. కానీ, రానున్న ఎన్నికల్లో  బీజేపీ 30శాతం ఓట్లు రాబట్టగలదా అనేది సందేహంగా మారింది.  

విసుగెత్తిన ప్రజలు​

బీఆర్ఎస్​అధినేత కేసీఆర్, ఆయన  సర్కిల్​కు ఓవర్ ఎక్స్​పోజర్​ ఉంది. చాలా మంది రాజకీయ నాయకులు అతిగా, బహిరంగ రాజకీయాలు చేయడం మంచి రాజకీయమని పొరబడతారు.  కానీ, ప్రజలు అన్నివేళలా అంతగా ఆసక్తి చూపడం లేదు. జనం విసిగిపోతున్నారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న నేతలు నవీన్‌‌‌‌ పట్నాయక్‌‌‌‌, జయలలిత వంటివారు భిన్నమైన పంథాను ఎంచుకున్నారనేది మనం గమనించవచ్చు. సుదీర్ఘకాలం కొనసాగిన నాయకులు ఓవర్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పోజర్‌‌‌‌లను నియంత్రించారు. అతిగా యాంటీ బయాటిక్స్ ఉపయోగిస్తే అవి ప్రాణాలకే ప్రమాదకరంగా మారి చంపేస్తాయనేది గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజినీరింగ్​ను రూపొందించింది. తెలంగాణలో కుల విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది. దీంతో రాష్ట్రంలో సామాజిక ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో ప్రభుత్వం32 జిల్లాల ఏర్పాటు ప్రతిపక్షాలను ప్రజల నుంచి దూరం చేయలేకపోయింది. అదేవిధంగా కేసీఆర్​ పాలనపై సదాభిప్రాయం కూడా రాలేదు. కేసీఆర్​ నిర్ణయం వల్ల నియంత్రణ, పర్యవేక్షణ కొరవడిందని, పరిపాలన, రాజకీయ గందరగోళం చాలా ఎక్కువైందని, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నది కూడా ఓ జిల్లానా? అనే అభిప్రాయాలు తలెత్తాయి. సీఎం కేసీఆర్ ఎన్నో ప్రజాకర్షణ పథకాలు ప్రకటించారు. రైతు బంధు పథకంతోపాటు  కొన్ని స్కీమ్‌‌‌‌లు కూడా ఉండాలి. వందల పథకాలు 32 జిల్లాల్లో చిత్తశుద్ధితో ఎలా అమలు చేస్తారనే వాదన కూడా ఉంది. ఎన్నో సవాళ్లను తలపించే తుపానులు ఎదుర్కునేందుకు కూడా పరిష్కారాలను ఉంటాయి. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడ చాలా బరువుగా ఉంటే  కెప్టెన్ సరుకును డంప్ చేస్తాడు. అదేవిధంగా ఓడ చాలా తేలికగా ఉన్నప్పుడు వారు దానిలోకి నీటిని పంపుతారు. పర్ఫెక్ట్ స్టార్మ్ నుంచి బయటపడేందుకు కేసీఆర్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి.

బీసీలపై బీజేపీ నజర్​

బీసీల ఓట్లపై కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గిన తర్వాత, వెనుకబడిన తరగతులపై బీజేపీ దృష్టి పెట్టింది. కేసీఆర్ సర్కారును అధికారం నుంచి దించేందుకు బీజేపీ బీసీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఓ పార్టీ అధికారంలోకి వచ్చే విషయంలో బీసీలు అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో కాకుండా తెలంగాణలో సామాజిక స్థిరత్వం ఉంది.  భారతీయ జనతా పార్టీ ఆరవ వంతు ఓట్లను దాటితే, ఏ పార్టీకి మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చు. ప్రతి రాష్ట్రంలో మూడు పార్టీలకు ఒక్కొక్కటి 17శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే సాధారణంగా హంగ్ అసెంబ్లీ లేదా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ 17శాతం ఓట్లను దాటగలదా? అనేది అసలు ప్రశ్న. మరోవైపు కేసీఆర్ ఎన్నికల వ్యూహాలు పన్నుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్  తన పోరాటం తీవ్రం చేస్తున్నారు. అభిమన్యుడి పద్మవ్యూహం లాంటి ఎన్నికల పెను తుపాను నుంచి విజయవంతంగా బయటపడటానికి యోధుడు అలుపెరగకుండా తీవ్రంగా పోరాడాలి.  ఇటీవలే తనకు ద్రోహం చేసిన కొందరు ఖమ్మం రాజకీయ నేతలపై విరుచుకుపడి కేసీఆర్ తన పాత స్టైల్ ను ప్రజలకు చూపించారు. ఇపుడు నిన్నటి వరకు తనను విమర్శించిన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. అది తిరగబడుతుందా, వర్కవుటవుతుందా.. చెప్పలేము.  ఇక ముందు కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. కానీ, ఆయన అపర మేధావి. రాజకీయ చాణక్యుడు. అయితే, ప్రాథమికంగా అంతా బాగానే ఉందని చెప్పే భజనపరుల పట్ల  ఆయన అప్రమత్తంగా ఉండకపోతే మూల్యం చెల్లించక తప్పదు. 

మునుపటిలా  రైతులు, మైనారిటీల మద్దతు ఉన్నదా?

తెలంగాణ ప్రజల్లో కేసీఆర్‌‌‌‌కు ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. మరికొందరు ముఖ్యమంత్రుల మాదిరిగా కేసీఆర్ బహిరంగంగా సామాజిక భయాన్ని ఎన్నడూ  ప్రేరేపించలేదు.  కేసీఆర్‌‌‌‌కు  రైతులు పెద్ద అండగా నిలుస్తూ వస్తున్నారు. రైతులకు మద్దతుగా రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన నాయకుడు కేసీఆర్. రైతులకు ఈ విషయం బాగా తెలుసు. ప్రతిపక్షం కూడా రైతు పథకాలను ప్రకటించాయి. రైతులు ఎటువైపు మొగ్గుతారో చూడాలి.  మజ్లిస్​ పార్టీ చీఫ్​ ఒవైసీ బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌‌‌‌తో ఉన్నందున మైనారిటీలు తమ ఎంపికలో కొంచెం కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్‌‌‌‌పై బీజేపీ మాటల యుద్ధం చేయడం వల్ల ఆయనకు, మైనారిటీలకు మేలు చేస్తాయా చూడాలి.  గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే..  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా​ ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్‌‌‌‌లు రెండు పార్టీల రాష్ట్రంగా ఉన్నది. అయితే, కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ​కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోతే అది చరిత్ర అవుతుంది.

- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్​