కేసీఆర్ ఇకపై కరీంనగర్‌‌‌‌లోనే ఉంటారు : వినోద్​ కుమార్​

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై కరీంనగర్‌‌‌‌లోనే ఉంటారని, అందుకే తన సొంతింట్లో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయించుకుంటున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. కరీంనగర్‌‌‌‌కు వచ్చే ఉద్దేశంతోనే ఇక్కడి తెలంగాణ భవన్‌‌లో లిఫ్ట్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, ఆ బాధ్యతలు గంగుల కమలాకర్‌‌‌‌కు అప్పజెప్పారన్నారు. 

ఆదివారం స్థానిక పద్మక నాయక కల్యాణ మండపంలో నిర్వహించిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి నుంచి కేసీఆర్‌‌‌‌కు కరీంనగర్, వరంగల్ అండగా నిలిచాయని, ఎప్పుడు బాధలో ఉన్నా, నిరాశలో ఉన్నా ఈ జిల్లాలకు వస్తే తనకు ధైర్యం వస్తుందని కేసీఆర్ అనేకసార్లు చెప్పారని గుర్తుచేశారు. 

కాంగ్రెస్ ఇచ్చినవి ఆచరణలో సాధ్యం కాని హామీలని ఆరోపించారు. పులి బయటికొస్తే వలతో బంధిస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని, వలలతో కేవలం కుందేళ్లను మాత్రమే బంధించగలుగుతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌‌‌‌ను దొరకబట్టే బోను ఇంకా తయారు కాలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.