- నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే లారీతో తొక్కించారు
- మంథనిలో లాయర్ దంపతులను నరికి చంపారు
- రైతులను జైళ్ల పాలు చేశారు
- మంథని బహిరంగ సభలో కాంగ్రెస్ లీడర్ విజయశాంతి
పెద్దపల్లి, వెలుగు : ‘కేసీఆర్ నీ టైం అయిపోయింది. నిన్ను దించేస్తాం. నీ హయాంలో అన్నీ హత్యారాజకీయాలే.. నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిని లారీలతో తొక్కించారు. మంథనిలో న్యాయం కోసం పోరాడుతున్న లాయర్ దంపతులను పట్టపగలే నరికి చంపారు. హక్కుల కోసం ప్రశ్నించిన రైతులను బేడీలు వేసి జైళ్ల పాలు చేశారు’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. కరీంనగర్జిల్లా మంథనిలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. టీఎస్పీఎస్సీ లో జరిగిన అవినీతిలో ఎవరినీ ప్రశ్నించలేదని, మేడిగడ్డ కూలిపోయే స్థితిలో ఉందని, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలను సీఎం కేసీఆర్మోసం చేశారన్నారు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగలన్నారు. ‘మోదీ, అమిత్‌షా, నడ్డా.. ప్రతిసారీ తెలంగాణలో కేసీఆర్‌ది కుటుంబపాలన, అవినీతిలో మునిగిపోయిందంటరు. కానీ, ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కవిత లిక్కర్‌స్కాంలో అడ్డంగా దొరికినా ఆమెపై చర్యలు లేవు’ అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నడుమ తెరవెనుక ఒప్పందాలున్నాయని, ఎలాగైనా కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. అవినీతి సర్కార్‌ను ఇంటికి పంపడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. మంథని కాంగ్రెస్అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నాయకులు పాల్గొన్నారు.