అరణ్యవాసమా.. అస్త్ర సన్యాసమా..? :కేసీఆర్ తీరేంటి..!

అరణ్యవాసమా.. అస్త్ర సన్యాసమా..? :కేసీఆర్ తీరేంటి..!

తెలంగాణ సమకాలీన రాజకీయ కురుక్షేత్రంలో.. మహాభారతంలోని అరణ్యవాసం, అజ్ఞాతవాసం, అస్త్రసన్యాసం అనే పదాలిప్పుడు పదేపదే గుర్తుకొస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ వ్యూహాల చతురుడిగా పేరున్న  కేసీఆర్ గమనం, వైఖరి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒకింత చర్చకు దారి తీస్తున్నది. ఇంతకీ కేసీఆర్ అరణ్యవాసంలోకెళ్లిపోయారా?  ఇంకా అజ్ఞాతవాసంలోనే ఉండి ఏకంగా  అస్త్రసన్యాసమే  చేయబోతున్నారా? అనే సూదంటు ప్రశ్నలకు బలమైన సంకేతాల రూపంలో సమాధానాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఆయన అడుగులు,  వైఖరిని నిశితంగా గమనిస్తే రకరకాల అనుమానాలు రాక తప్పవు. రాజకీయాల్లో చర్చంతా తన చుట్టే తిరగాలని కోరుకునేవాళ్లలో  కేసీఆర్  ఒకరు. రాజకీయాల్లో ఉత్థాన పతనాలను చూసిన ఆయన క్రమేపి పాలిటిక్స్​కు  స్విచాఫ్ అవుతున్నారనే  బలమైన  సంకేతాలొస్తున్నాయి.

రాష్ట్రంలో అనేక అంశాలు తెరపైకొస్తున్నా ఏ ఒక్క అంశంపై కూడా కేసీఆర్ మాట్లాడడం లేదు. ఇక వలుపట దాపటగా బావమర్దులిద్దరే క్షేత్రంలో పోటీపడి తిరుగుతున్నా,  పోటాపోటీ ప్రకటనలు  జారీ చేస్తున్నా క్షేత్రంలో పంట పండిందీ  లేదు. చేతికొచ్చిందే లేదన్నట్టుగానే తయారైందన్నది విశ్లేషకుల మాట. కేసీఆర్ అడ్రసెక్కడో చెప్పాలని సొంతసెగ్మెంట్ జనాలే ఠాణాల్లో ఫిర్యాదులిచ్చే పరిస్థితి వచ్చింది.

అస్త్ర సన్యాసానికి ఆరు కారణాలు

వరుస పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తీరు పట్ల రాజకీయ పండితులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.  ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారనే విమర్శలూ ఎదుర్కొంటున్నారు. దీంతో అంటీముట్టనట్టుగా ఉండే కేసీఆర్ అరణ్యవాసంలోనో, అజ్ఞాతవాసంలోనో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక  ఆయన్ను దగ్గరగా చూసొస్తున్న వారైతే ఏకంగా అస్త్రసన్యాసానికి అడుగులేస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఆయన అజ్ఞాతవాసపు అస్త్రసన్యాస రాజకీయాల ప్రచారాలను  పరివిధాలుగా పరికిస్తే..ఇందుకు ప్రధానంగా ఆరు కారణాలు కనపడుతున్నాయి. 

1. ప్రజలపై అలక 

పదేండ్లు తిరుగులేని శక్తిగా ఉండి  2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో 37.35 శాతం ఓట్లతో  ప్రతిపక్ష హోదాను దక్కించుకుని, ఊహించని ఓటమిని చవిచూసిన కేసీఆర్ ఇంత చేసినా తనకెందుకు ఓటెయ్యలేదని తెలంగాణ జనంపై ఆయన కోపంతో ఉన్నారన్నది వాస్తవం. దీంతో పదేండ్లు వెంట నడిచిన జనాలకు కృతజ్ఞతలు చెప్పలేదు,  పార్లమెంట్ ఎన్నికల్లో  తనకు తాను తగ్గి ప్రచారంలో ఎన్ని విన్యాసాలు చేసినా, 
అరెస్టయిన తన బిడ్డ కవిత గురించి మాట్లాడి సానుభూతిని ప్రయోగించినా, కేసీఆర్ నాయకత్వాన్ని బండకేసి కొట్టిప్రజలు  ఒక్కసీటు కూడా గెలిపించలేదు. అందుకే ప్రజలతో, లీడర్లతో ఆయన అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పడు ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశమే లేదంటున్నారు. 
ఓ రకంగా అరణ్యవాసంగానే చెబుతున్నారు. 

2. రేవంత్​తో పోటీ పడలేక..

ఇక ప్రధానంగా సీఎం రేవంత్​ను కేసీఆర్ ఇంకా సీఎంగా పోల్చుకోలేకపోతున్నారట. అందుకే ఎదురుపడి  ముఖాముఖి రాజకీయాలు చేయడం ఇష్టం లేదని ఫాంహౌస్​లోని ఆయన సన్నిహితవర్గాలు ప్రచారం చేస్తున్నాయి. తనకు సమానమైన స్ఖాయి లేదని చెప్పేవారు కానీ ఇవాళ ఏకంగా రేవంత్ తెలంగాణ సీఎం అయి కూర్చున్నారు. రేవంత్​కు ఎదురుపడి మాట్లాడడం, రాజకీయాలు చేయడం, ప్రజాక్షేత్రంలోకి వచ్చినా రాజకీయాలన్నీ రేవంత్ వర్సెస్ కేసీఆర్​లా మారతాయే తప్ప కేసీఆర్​కు పెద్దగా ఒనగూరేది లేదని ఓ నిర్ణయానికి వచ్చేశారట. సమకాలీన రాజకీయాల్లో  రేవంత్ ఇమేజ్​తో కేసీఆర్ పోటీ పడలేకపోతున్నారని చెబుతున్నారు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవ్వడం సహజమే అయినా  కేసీఆర్ రేవంత్ సీఎం కావడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సీఎం కుర్చీలో  రేవంత్ కూర్చున్న దగ్గర నుండి కేసీఆర్ అదోలా వ్యవహరిస్తున్నారని కూడా ఫాం హౌస్​ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 

3. అదును కోసం ఎదురుచూపు

అదును చూసి వ్యూహాలు పన్నడంలో కేసీఆర్ దిట్టగా చెబుతుంటారు. అందుకే ఆయన అదును కోసం చూస్తున్నారని తెలుస్తోంది. ఎప్పటికైనా కాంగ్రెస్​పై వ్యతిరేకత రాక తప్పదు. ఆ పార్టీలో వర్గ విభేదాలు పొడచూపక తప్పని పరిస్థితి అని ఓ దింపుడు కల్ల ఆశ. ఒక దశలో కాంగ్రెస్​లోని కొందరు ఇప్పటికీ ఆయనతో టచ్​లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీలో అంతర్గత విభేదాలొచ్చేంతవరకు వేచి చూడాలనే ధోరణిలో కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నారు. 

4. వృద్ధాప్యం.. అనారోగ్యం

72 ఏండ్లున్న  కేసీఆర్ వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలు అనివార్యం. ఈ క్రమంలో ఆయన ప్రధాన ప్రతిపక్షనేతగా వీధి పోరాటాలు చేయలేరు. కోర్టుల చుట్టూ తిరగలేరు. కూర్చుని ఆదేశాలిచ్చినా ఏదో ఒక కార్యక్రమానికి విధిగా రావాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతున్న  కేసీఆర్ ఇటీవల ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సన్నిహితులను పిలిచి ఫొటోలు రిలీజ్ చేస్తూ ఆరోగ్యంగానే ఉన్నట్టు సంకేతాలిస్తున్నారు. ఆరోగ్యంగానే ఉన్నా..బలంగానే ఉన్నా..మీరు పోరాటాలు చేయండని అంటున్నారే తప్ప,  తాను కార్యక్షేత్రంలోకి దిగుతానని మాత్రం చెప్పడం లేదు. అందుకే ఆయన రాజకీయాల నుంచి అస్త్ర సన్యాసం చేయబోతున్నట్టు సంకేతాలొస్తున్నాయి.

5. ప్రత్యర్థిని ఎంచుకోవడంలో అనిశ్చితి

రాజకీయాల్లో దేనికైనా ప్రత్యర్థి అనివార్యం. అయితే భావి రోజుల్లో ఆ ప్రత్యర్థి ఎవరన్నది కేసీఆర్​కు  క్లారిటీ లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా తాను ఎవరిపై యుద్ధం చేయాలో తెలియక తడబడుతున్నట్టు కనిపిస్తున్నది. బీజేపీని ముఖ్యంగా మోదీని ఇప్పుడు విమర్శించలేరు. అలాగని బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు నెరపలేరు. ఇక అధికార కాంగ్రెస్​పై పోరాటం చేసే పరిస్థితీ కనిపించడం లేదు. ఒకవేళ కాంగ్రెస్​ను టార్గెట్ చేస్తే భావి రోజుల్లో అది బీజేపీకి మేలు జరుగుతుందనే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే తన ఫైట్​పై ప్రత్యర్థి లాభ నష్టాల అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. అంతేకాదు ఇంతకీ పార్టీని తెలంగాణకే పరిమితం చేయాలా లేక బీఆర్ఎస్ అనే పదం కొనసాగించాలా ఆనే మీమాంసలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కేసీఆర్​కు ఇప్పటికిప్పుడు రాష్ట్ర, కేంద్ర రాజకీయాలపై ఓ క్లారిటీ లేనప్పుడు పోరాటం వృథా ప్రయాస అని అందుకే తన అరణ్యవాసాన్ని కొనసాగిస్తారని చెబుతున్నారు. 

6. సమీపంలో ఎన్నికలు లేవు

ఎప్పుడూ ఎన్నికల సందర్భాల్లోనే బయటకొచ్చే కేసీఆర్ ఇప్పట్లో ఏ ఎన్నికలు లేనందున తన అజ్ఞాతవాసం ఇంకా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. జనవరి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలున్నా సహజంగా అవి అధికార పార్టీ, ప్రభుత్వాలకే అనుకూలంగా ఉంటాయనే నిగూఢ సత్యం ఆయనకు బాగా తెలుసు. అందుకే మంత్రాల బలంతో కాకపోయినా, తుప్పిర్లతో కేటీఆర్, హరీష్ రావ్​లతో స్థానిక సమరాంగణం పూర్తి చేయాలని కూడా ఓ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

పోటెవ్వరు సాటెవ్వరు!

రాజకీయ పార్టీ 24 గంటలు ప్రజల నోళ్లలో నానాలనుకోవడం సహజమే. అయితే ఆ పార్టీ ప్రజల్లో ఏ మేరకుంటున్నది.. దానికి నాయకత్వం వహిస్తున్నదెవ్వరన్న చర్చ విధిగా వస్తోంది. రాష్ట్రంలోని సమస్యలపై కేసీఆర్​ నుంచి ఒక్క ప్రకటనా లేదు. ఖమ్మం , వరంగల్ జిల్లాల వరద బీభత్సానికి గురైనా కేసీఆర్ నుంచి సంతాప ప్రకటన కూడా రాలేదు. కానీ అనేక అంశాలలో పార్టీలో అటు వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్,  ట్రబుల్ షూటర్ హరీష్  క్షేత్రంలో ఉండి పోరాటాలు చేస్తు న్నారు. అయితే, అవి పోటీ ఆరాటాలుగానే కనపడుతున్నాయే తప్ప జనాల్లో అంత పెద్దగా చొచ్చుకెళ్లడం లేదు. 

పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవాలనే ఆరాటం, తానే భావి రోజుల్లో పార్టీకి దిశా నిర్దేశమనే సందేశాలిస్తున్నారు. అయితే, వీరి ఆధిపత్య పోరును  కేసీఆర్ నియంత్రించ లేకపోతున్నారు. అటు కుటుంబపరంగా తలెత్తుతున్న అనేక అంశాలు సమాధానా ల్లేని ప్రశ్నలుగా  మారుతున్నాయి. అవునన్నా కాదన్నా హరీష్​కు మాస్ ఫాలోయింగ్ ఉన్నది. మరో పక్క విరాసత్ రాజకీయాల వారసుడు కేటీఆర్​ను  కాదని కేసీఆర్ హరీష్​కు బాధ్యతలు కట్టబెట్టగలరా..మరి కేటీఆర్​కు పగ్గాలిస్తే పార్టీలో ఏకాభిప్రాయాన్ని సాధించగలరా అనే చర్చ లేకపోలేదు.

- వెంకట్ గుంటిపల్లి,
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం