రోజూ అసెంబ్లీకి వెళ్లండి.. సర్కార్‎ను నిలదీయండి: కేసీఆర్

రోజూ అసెంబ్లీకి వెళ్లండి.. సర్కార్‎ను నిలదీయండి: కేసీఆర్
  • బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  కేసీఆర్​ దిశానిర్దేశం
  • పోరాడాల్సిన అంశాలపై ఎల్పీలో చర్చించి సభలోకి పోవాలి
  • సభ్యులను సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్​ లీడర్లను నియమిస్తం
  • పదేండ్లలో బీఆర్​ఎస్​ సర్కార్​ చేసింది రూ.4 లక్షల కోట్ల అప్పులే
  • 14 నెలల్లోనే కాంగ్రెస్​ ప్రభుత్వం రూ. లక్షన్నర కోట్ల అప్పు చేసింది
  • అయినా హామీలను అమలు చేస్తలే.. దీనిపై గట్టిగా ప్రశ్నించాలి
  • ఈ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్య

హైదరాబాద్​, వెలుగు: బీఆర్​ఎస్​ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా రోజూ అసెంబ్లీకి తప్పకుండా హాజరుకావాలని.. సభ ప్రారంభానికి అద్దగంట ముందే ఉదయం 9.30 గంటల కల్లా అసెంబ్లీకి చేరుకోవాలని ఆ పార్టీ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. పోరాడాల్సిన అంశాలపై రోజూ ఉదయం ఎల్పీలో సమావేశం పెట్టుకుని చర్చించాలని, అనంతరం సభలోకి వెళ్లాలని సూచించారు. సభలో మాట్లాడాల్సిన అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలన్నారు. 

సమస్యలపై సభలో సమర్థవంతంగా నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేలా డిప్యూటీ ఫ్లోర్​లీడర్లను నియమిస్తామని ఆయన చెప్పారు. మంగళవారం తెలంగాణభవన్‎లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్​ఎస్​ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. 
దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు.  పదేండ్లలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిందని, కాంగ్రెస్​ సర్కారు మాత్రం 14 నెలల్లోనే రూ.లక్షన్నర కోట్ల అప్పులు చేసిందని వ్యాఖ్యానించారు. 

అప్పుల విషయంలో ప్రభుత్వానికి దీటుగా కౌంటర్​ ఇవ్వాలన్నారు. ‘‘ఈ సర్కార్​ భారీగా అప్పులు చేసినా హామీలను అమలు చేస్తలేదు. హామీల అమలులో విఫలమైంది. దీనిపై నిలదీయండి” అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  కేసీఆర్​ సూచించారు. కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్టార్టయిందని, రైతుల్లో అది స్పష్టంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. రైతుబంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను సర్కారు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నదని దుయ్యబట్టారు. కాళేశ్వరాన్ని బంద్​ పెట్టి రైతులకు నష్టం చేస్తున్నదని మండిపడ్డారు. 

హామీల అమలేది.. విద్యార్థులకు స్కాలర్​షిప్​లేవీ..?

రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని బీఆర్​ఎస్​ నేతలకు కేసీఆర్​ సూచించారు. ‘‘ఈ సర్కారు అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలి. బీఆర్​ఎస్​ పార్టీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు తదితర రైతన్నల సమస్యలపై నిలదీయాలి. ఎండాకాలం రాకముందే మంచినీటి కొరత ఏర్పడ్డది. దీనిపై పోరాడాలి” అని వారికి చెప్పారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు.

 ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్​బెనిఫిట్స్, డీఏల పెండింగ్​, పీఆర్సీ అమలుపై ప్రభు త్వాన్ని నిలదీయాలన్నారు. మహిళలకు ఇచ్చిన హామీ లపై పోరాడాలని సూచించారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి.. వాటిని ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని, మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని కేసీఆర్​ దుయ్యబట్టారు. ‘‘విద్యార్థుల స్కాలర్​షిప్​లను విడుదల చేస్తలే. వైద్యరంగంలో ప్రమాణాలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నయ్​. దళితబంధును నిలిపేసింది. వీటన్నిటిపై అసెంబ్లీ సమావేశాల్లో గొంతెత్తాలి” అని   కేసీఆర్​ సూచించారు. 

అటెండ్​ కాని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

పలు కారణాలతో బీఆర్ఎస్‎లోని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ఎల్పీ సమావేశానికి హాజరు కాలేదు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్​రావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడంతో రాలేదు. ఇంట్లో వివాహం కారణంగా ఎమ్మెల్యే అనిల్​జాధవ్​, చైనా టూర్‎లో ఉండడంతో ఎమ్మెల్సీ శంభీపూర్​రాజు, అనారోగ్య కారణాలతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎల్పీ భేటీకి అటెండ్​కాలేదు. కాగా, బుధవారం అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​హాజరు కానున్నారు.