రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కువయ్యారు : రేవంత్ రెడ్డి

రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కువయ్యారు : రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కువయ్యారని, వారికి పదవులు పంచుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక టీఆర్ఎస్ తో కేసీఆర్ కుటుంబానికి రాజకీయంగా, బిజినెస్ పరంగా ఉపయోగం లేదన్నారు. అందుకే ప్రొప్రైటర్ కన్సల్టెన్సీ కంపెనీ నుంచి ప్రైవేటు కంపెనీ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో కొడుకు కేటీఆర్ అలిగి హైదరాబాద్ లో ఉంటే, కూతురు కవితను బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీసు ప్రొగ్రామ్​కు తీసుకువచ్చారన్నారు. బుధవారం ఆయన ఎంపీ ఉత్తమ్ తో కలిసి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్​ వార్​రూమ్​పై పోలీసుల దాడిని ఖండించారు. కేసీఆర్ తన రాజకీయాల అవసరాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ డీఎన్ఏ అందరికీ తెలుసు, ప్లాస్టిక్ సర్జరీ లెక్క పార్టీ పేరు మార్చినంత మాత్రాన ఆలోచనలు మారవు. ఎనిమిదేండ్లు అధికారంలో ఉన్న ఆయన రాష్ట్రాన్ని ఎంత లూఠీ చేశారో అందరికీ తెలుసు” అని అన్నారు. 

మరోసారి బీఆర్ఎస్(కేసీఆర్) కు గెలిచే అవకాశం వస్తే.. రాష్ట్రంలో ‘లిక్కర్ సర్కార్’ వస్తుందని రేవంత్ విమర్శించారు. ఇప్పుడు లిక్కర్ ఇన్వెస్ట్​మెంట్లు రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు చేరాయన్నారు. రాష్ట్రంలో మీడియా చానెల్స్, పేపర్లను కేసీఆర్ కొన్నారన్నారు. అందువల్ల కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర సర్కార్ వైఫల్యాలు, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తోందని చెప్పారు. ప్రతిపక్షాలపై మోడీ మోడల్ ను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. మోడీ సీబీఐ, ఐటీ, ఈడీ విధానాన్ని అవలంబిస్తే... కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. ఈ విధానం తెలంగాణలో చెల్లదన్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్​యాదవ్​, కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి కేసీఆర్ నిజ రూపాన్ని తెలుసుకోవాలని ముందుకు వెళ్లాలని సూచించారు. కేసీఆర్ అవినీతి పరుడని, ఆయనపై చాలా చార్జ్ షీట్లు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తితో కలిసి వెళ్తే నష్టపోతారని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ వార్ రూమ్​పై పోలీసుల దాడిపై పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇచ్చినట్లు చెప్పారు. వార్ రూంపై మంగళవారం రాత్రి పోలీసులు గుండాల్లా దాడి చేశారని అని ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ చైర్మన్ పవన్ కెహ్రా మండిపడ్డారు. 50 కంప్యూటర్లు, పార్టీ డేటా తీసుకెళ్లారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.