హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతున్నామని తెలియడంతోనే ప్రజల దృష్టిని మళ్లించడానికి సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని, కానీ స్క్రిప్ట్ రైటర్‌గా ఆయన ఫెయిల్ అయ్యారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘నాటకం వేసి సెన్షేషన్ చేద్దామనుకున్నడు. కానీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లోనే ప్లాన్డ్ గా చేసిన ఈ నాటకం రక్తి కట్టలేదు. స్క్రిప్ట్ రైటర్ గా సీఎం కేసీఆర్ ఫెయిల్. పొలిటికల్ గా మంచి వ్యూహకర్త అని పేరున్న కేసీఆర్ కు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది. ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. అసొంటోళ్లను మేమెందుకు చేర్చుకుంటం. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలి. కేసీఆర్ ను అరెస్టు చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారం వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో బీజేపీ ఎప్పుడూ ఎమ్మెల్యేలను కొనలేదన్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వస్తామంటే రాజీనామా చేసిన తర్వాతనే రావాలని పార్టీ చెప్పిందని, రాజీనామా చేసి వచ్చిన వాళ్లంతా భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలుగా గెలిచారని తెలిపారు. ‘‘తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఓటముల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా కేసీఆర్ కు వ్యతిరేకం అవుతున్నారు. ఆ భయంతోనే ప్రజలను మైండ్ చేంజ్ చేద్దామని చెప్పి బీఆర్ఎస్ పెట్టిండు. కానీ వర్కవుట్ కాలే. 14 మంది మంత్రులు ఇక్కడకు వచ్చి పని చేసిన తర్వాత కూడా ప్రజలు ఓపెన్ గా ఇక్కడ బీజేపీని గెలిపిస్తామని చెప్తున్నారు. అన్ని సర్వే రిపోర్ట్ లు కూడా అదే చెప్తున్నాయి” అని వివేక్ చెప్పారు.