కమీషన్ల కోసమే కేసీఆర్‌‌ ప్రాజెక్టులు కట్టిండు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • ఆర్‌ ‌అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • 70 ఏండ్లైనా నాగార్జునసాగర్​ చెక్కు చెదరలే
  • 2 లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయింది
  • సుందిళ్ల, అన్నారం బ్యారేజీలూ కొట్టుకుపోతాయని కామెంట్

నల్గొండ, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్‌‌  కమీషన్లకు కక్కుర్తిపడి రాష్ట్రంలో ఇరిగేషన్‌  ప్రాజెక్టులు కట్టారని ఆర్‌ ‌అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ హయాంలో 70 ఏండ్ల  కింద నిర్మించిన నాగార్జున్ సాగర్​ ప్రాజె క్టుకు చిన్న గీత కూడా పడలేదని, రూ. 2 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం మూడేళ్లలో కూలిపోయిందని ఆయన విమర్శించారు. ఇప్పటికే మేడిగడ్డ కూలిపోగా.. రేపో, మాపో సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా కొట్టుకుపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. రూ.100 కోట్లతో చేపట్టిన నల్గొండ మండలం ముషంపల్లి, కన్నెకల్  రోడ్డు విస్తరణ పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో నాణ్యత కన్నా కమీషన్ల పైనే దృష్టి పెట్టిందన్నారు.  లక్షల కోట్ల ప్రజధనాన్ని దుర్వినియోగం చేసిన ఆ పార్టీ నాయకులు తమకు నీతులు చెప్పడం సిగ్గుచేటని ఫైర్​  అయ్యారు. కేసీఆర్‌‌ ముప్పై ఊర్లను ముంచి కొండపోచమ్మ, మల్లన్న సాగర్​  రిజర్వాయర్లు కట్టారని చెప్పారు.

కానీ, కొండపోచమ్మ నుంచి నీళ్లు ఎక్కడికి పోవడం లేదని,  కనీసం దాని కింద ఉన్న ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు కూడా నీళ్లు వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు. కేసీఆర్​ చర్యల వల్లే నల్గొండ జిల్లాలో కరువు పరిస్థితి దాపురించిందని మంత్రి ధ్వజమెత్తారు. ఆయన ప్రగతి భవన్, ఫాంహౌజ్​ నుంచి బయటకు వచ్చి ఉంటే ఏపీ సీఎం జగన్మోహన్​ రెడ్డి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ కు​ నీళ్లు తరలించుకుపోయే వాడా? అని ఆయన ప్రశ్నించారు. తనపైన కోపంతోనే శ్రీశైలం సొరంగ మార్గం, ఏఎమ్మార్పీ కాల్వల లైనింగ్‌  పనులు, బ్రహ్మణవెల్లం ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు.  రూ. 1500 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే కరువు పరిస్థితుల్లో కూడా  శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్లమన్నారు. ఇప్పుడు సాగర్‌  ‌కూడా నీళ్లు లేవని, దాంతో ఎమ్మార్పీ కాల్వలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు.