కర్నాటక ఎన్నికలపై కేసీఆర్ విచిత్ర మౌనం

కర్నాటక ఎన్నికలు భారతదేశంలో ప్రధాన రాజకీయ ఘట్టంగా మారాయి. కర్నాటక బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి ఆసక్తి నెలకొంది. ఇక్కడ 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018లో బీజేపీ108 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. 25 ఏండ్లుగా కర్నాటకలో ఏ పార్టీ కూడా మళ్లీ విజయం సాధించలేదు. దీనికి కారణం కర్నాటకలో 3 పార్టీలు పాతుకుపోయి ఉండటమే. అవి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్. బహుళ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో, ఏ పార్టీ అయినా మెజారిటీ సాధించడం కాస్త కష్టమే. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, అందుకే గెలుపుపై ఆశాజనకంగా ఉంది. విచిత్రమేమిటంటే జేడీ(ఎస్)నేత కుమారస్వామి 2018లో అయినట్టుగానే తాను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకుంటున్నారు. ఆయన35 కంటే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలవలేరు. కర్నాటకలో కులం ఆధిపత్యం ఉంది. లింగాయత్‌‌లు, వొక్కలిగలు ఆధిపత్య కులాలు. వెనుకబడిన తరగతులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి, అక్కడ 16 %  ముస్లిం జనాభా కూడా కీలకమే.

బీజేపీకి సవాళ్లు

కర్నాటకలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. యడ్యూరప్పను రిటైర్‌‌ చేసేందుకు ఆ పార్టీ చైతన్యవంతమైన అడుగు వేసింది. అది కొత్త రక్తం, కొత్త నాయకత్వాన్ని కోరుకుంది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన కొత్త పాత్రలో ఇంకా స్థిరపడలేదు. కొంత అసంతృప్తి ఉన్నది. కర్నాటక జాతీయ-పార్టీ ఆధిపత్య రాష్ట్రం. కుమారస్వామి పార్టీ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకే పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. అందుకే ప్రజలు అధికార బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉంటే సహజంగానే కాంగ్రెస్​ పట్ల మొగ్గు చూపుతారు. వివిధ కులాల మధ్య పోటీ డిమాండ్లు ఉన్నాయి. బీజేపీ చాలా మంది లింగాయత్​లను ముఖ్యమంత్రులను చేసింది. వారు ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. లింగాయత్‌‌లు మరిన్ని డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. ఇది ఇతర కులాలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. కుమారస్వామి, కాంగ్రెస్ ముఖ్య నాయకుడు డీకే శివ కుమార్ ఇద్దరూ వొక్కలిగలు. శక్తివంతమైన వొక్కలిగ సామాజికవర్గం బీజేపీని లింగాయత్‌‌ ఆధిపత్య పార్టీగా భావిస్తోంది. కాబట్టి వారు కుమారస్వామికి, కాంగ్రెస్ కు గట్టి మద్దతుదారులుగా మారారు. జనాభాలో16 % ఉన్న ముస్లింలు.. కాంగ్రెస్​కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ఆ పార్టీకి భారీ ప్రయోజనం చేకూర్చనుంది. 

కేసీఆర్​ పెద్దన్న పాత్ర ఏది? 

కర్నాటకలో కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తారని తెలుగు ప్రజలు విన్నారు, అనుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భుజస్కందాలపై ఎన్నికలకు వెళ్లి జాతీయ వేదిక ఎక్కాలని కేసీఆర్ ​అనుకున్నారు. కానీ కొన్ని నెలల నుంచి కర్నాటక విషయంలో కేసీఆర్ ఒక విచిత్ర మౌనాన్ని పాటిస్తున్నారు. కుమారస్వామితో పొత్తు పెట్టుకుని కేసీఆర్ పదుల స్థానాల్లో బరిలోకి దిగుతారని కర్నాటక ఆశావహులంతా భావించారు. చాలాకాలం కేసీఆర్ అనేక పర్యటనలు చేసి, ఎంతో ఆప్యాయతతో కుమారస్వామిని కలుస్తూ వచ్చారు. కుమారస్వామి మాకు పాత మిత్రుడే అని చెప్పారు. అయినా ఒక్కసారిగా కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. ఆయన​ బీఆర్ఎస్ ​తరఫున అభ్యర్థులనేమీ పెట్టలేదు. కనీసం కుమారస్వామి పేరును కూడా కేసీఆర్​ ప్రస్తావించడం లేదు. కుమారస్వామి కూడా కేసీఆర్‌‌తో తన సమయాన్ని వృథా చేసుకున్నానని లోలోపలే నిశ్శబ్దంగా గొణుగుతున్నాడు. కేసీఆర్ మౌనంగా ఉండడానికి చాలా కారణాలే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన కుమార్తె కవిత పేరు బయట పడినప్పటి నుంచి, కేసీఆర్ కాంగ్రెస్​ పార్టీకి దగ్గర కావడం మొదలుపెట్టారు. ప్రతిపక్షాలు తనకు సహకరిస్తాయని కేసీఆర్​ భావిస్తున్నారు. అయితే కర్నాటకలో కేసీఆర్ తన అభ్యర్థులను నిలబెడితే కాంగ్రెస్​పార్టీని నిలదీయాల్సి వస్తుంది. అది తనకు కలిసిరాని విషయంగా భావించి ఉంటారు. ఇది మళ్లీ కాంగ్రెస్ ను ప్రత్యర్థి పార్టీగా విమర్శించాల్సి ఉంటుంది. కాబట్టి కర్నాటకపై గతంలో తాను చెప్పిన గొప్ప మాటలన్నీ పక్కకు పెట్టి కేసీఆర్ నిశ్శబ్దంగా ఉన్నారు. కుమారస్వామికి మద్దుతు తెలపడానికి, అలాగే తాను నిలబెట్టే బీఆర్ఎస్​ అభ్యర్థుల ప్రచారానికి  కేసీఆర్, ఆయన హెలికాప్టర్లు తిరుగుతుంటాయని, కర్నాటక ఓటర్లలో అవి దుమ్ము రేపుతాయని చాలా మంది భావించారు. కర్నాటకలో కేసీఆర్ కింగ్ మేకర్ అవుతారని కూడా ఊహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజున కేసీఆర్ బెంగళూరులో పెద్ద 5 స్టార్ హోటల్‌‌లో కూర్చుంటారని అంతా భావించినా.. అనూహ్యంగా ఆయన సైలెంట్​గానే ఉండిపోయారు. 

కాంగ్రెస్​కు కోపం తెప్పించొద్దనేనా?

కుమారస్వామి కూడా కేసీఆర్ విషయంలో ఏమీ మాట్లాడటం లేదు. పరిస్థితి చివరి నిమిషంలో వివాహం ఆగిపోయినట్లుగా కనిపిస్తున్నది. అందుకే ఈ విషయంలో రెండు పార్టీలు నిశ్శబ్దంగా ఉన్నాయి.  ఒక సంవత్సరం కాలం నుంచి  కర్నాటక రైతులు కేసీఆర్​ అద్భుతమైన పథకాల గురించి వింటున్నారు. కేసీఆర్​ మాకూ ఇస్తారని అనుకున్నారు. ఉచిత డబ్బు, ఉచిత విద్యుత్తు, ఉచిత వివాహాలు, ఉచిత దళిత బంధు ఇలా అన్నీ ఉచితంగా లభిస్తాయనుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని కూడా ఆశ్చర్యపడుతున్నారు. కర్నాటక రైతులు, రాజకీయ నాయకులందరూ కేసీఆర్​ నిశ్శబ్దం పట్ల విచిత్రంగా ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఏం జరిగిందో కేసీఆర్ మౌనం వీడి చెప్పాలి. జాతీయ నాయకత్వానికి మార్గం కర్నాటక మీదుగా ఉండగా.. కేసీఆర్ ఎందుకు వదులుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి కోపం తెప్పించడం కేసీఆర్​కు ఇష్టం లేదు కాబట్టి ! ఇకపై తెలంగాణ వెలుపల జరిగే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పాలి!.

బీజేపీ ప్రయత్నాలు

లింగాయత్ ఓట్లను ఏకీకృతం చేసేందుకు బీజేపీ 224 సీట్లలో 68 మంది లింగాయత్‌‌లకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీకి లింగాయత్ మద్దతు కొనసాగుతుందని భావిస్తున్నారు. బీజేపీ కూడా చాలా సోషల్ ఇంజినీరింగ్ చేసి మరీ వొక్కాలిగలకూ టిక్కెట్లు బాగానే ఇచ్చింది. తద్వారా మైసూరు ప్రాంతంలో తొలిసారిగా సీట్లు గెలుచుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఉద్దేశపూర్వకంగానే దాదాపు 70 మంది తాజా అభ్యర్థులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకురావడానికి, ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి బీజేపీ కొత్త అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. కర్నాటకలో నరేంద్ర మోడీ ఇమేజ్ చాలా ఎక్కువ. 2018లో బీజేపి సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా గెలిచింది. కానీ మెజారీటీ లేకపోయింది. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 28 మంది ఎంపీలకు గానూ 27 మందిని నరేంద్ర మోడీ గెలిపించుకున్నారు..

పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్​