పటాన్ చెరు, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని, జిల్లా ప్రజలకు వరాలు ఇస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు రూ.121 కోట్లతో చేపట్టనున్న ఫోర్ వే లేన్ రోడ్డు పనులు, రుద్రారంలోని సిద్ధి గణపతి ఆలయ ఆవరణలో రూ.4.50 కోట్లతో నిర్మించనున్న రాజగోపురాలు, కల్యాణ మండపం, అన్నదాన సత్రం నిర్మాణ పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం పటాన్చెరు మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన యార్డు కొత్త కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. కొత్త కమిటీ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో సంగారెడ్డిలో వైద్య కళాశాల, పటాన్చెరు నియోజక వర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం వచ్చి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముత్తంగి, ఇస్నాపూర్, పాశమైలారం రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం, ప్రమాదాలు జరుగుతుండటంతో వాటి నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. పాశమైలారం పారిశ్రామిక వాడ నుంచి కర్దనూరు ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఫోర్ వే లేన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఐదేళ్లుగా ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు, మలక్‌పేటలో ఉన్న ఉల్లిగడ్డ మార్కెట్ ను ఇక్కడికి తరలించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన విజయకుమార్ మార్కెట్ అభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.