భద్రాచలం/భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు: సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్‌పై చర్ల పోలీసులు అక్రమంగా పెట్టిన దేశద్రోహం, ఉపా కేసు ఎత్తివేయాలని కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం భద్రాచలం అశోక్‌నగర్ కాలనీలో ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. గోదావరి వరద బాధితులను ఆదుకోవాలని, ఎత్తు ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉద్యమించిన చరణ్‌పై కక్షగట్టి అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.
కొండా చరణ్‌పై దేశ ద్రోహం కేసు పెట్టడం దారుణమని ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ అన్నారు. కొత్తగూడెంలో నిరసన తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని పేర్కొంటూ అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఖానాపురం సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఇల్లెందు రోడ్డుపై ప్రదర్శన నిర్వహించారు.