Keedaa Cola Movie Review: కీడా కోలా మూవీ ఎలా ఉంది?

Keedaa Cola Movie Review: కీడా కోలా మూవీ ఎలా ఉంది?

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన లేటెస్ట్ క్రైం అండ్ కామెడీ ఎంటర్టైనర్ కీడా కోల. చైతన్య మందాడి, రాగ్‌ మయూర్‌, బ్రహ్మానందం, జీవన్‌ కుమార్‌, తరుణ్‌ భాస్కర్‌, విష్ణు, రవీంద్ర విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా నేడు(నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది?  ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

కథ: వాస్తు(చైతన్య రావు)కి నత్తి. చిన్నతనంలోనే పెరెంట్స్‌ చనిపోవడంతో తాత వరదరాజు(బ్రహ్మానందం) దగ్గర పెరుగుతాడు. అతని స్నేహితుడు కౌశిక్‌(రాగ్‌ మయూర్‌)ఓ లాయర్‌. ఈ ముగ్గురికి ఒకేసారి ఆర్ధిక ఇబ్బంది ఏర్పడుతుంది. డబ్బు ఎలా సంపాదిచాలా అని ప్లాన్‌స్ చేస్తుంటారు. ఒకరోజు వారికి కీడాకోలా(శీతల పానీయం)బాటిల్‌లో బొద్దింక కనిపిస్తుంది. అది చుసిన లాయర్‌ కౌశిక్‌కి ఓ ఆలోచన వస్తుంది. ఈ బొద్దింకను చూపించి ఆ కంపెనీ యజమానికి ఫోన్‌ చేసి రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తాడు. మరి ఆ యజమాని కౌశిక్ అడిగిన డబ్బులు ఇచ్చాడా? ఈ కథలోకి గల్లీ రౌడీ జీవన్‌(జీవన్‌ కుమార్‌), అతని అన్న నాయుడు(తరుణ్‌ భాస్కర్‌) ఎందుకు వచ్చారు?  కీడాకోలాలో బొద్దింక ఎలా పడింది? చివరకు ఎం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్ కు వెళ్లాల్సిందే. 

Also Read :- డ్యూయెట్ ప్రారంభం

విశ్లేషణ: టాలీవుడ్ లో ఇప్పటివరకు క్రైం కామెడీ జానర్ లో చాలా సినిమాలే వచ్చాయి. అందులో కొన్ని ఫసూపర్ హిట్ కాగ.. మరికొన్ని బోల్తా కొట్టాయి. ఇప్పుడు మరోసారి అదే జానర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తరుణ్ భాస్కర్. అయితే ఈసారి తన గత సినిమాల్లా కాకుండా పూర్తి భిన్నమైన పాయింట్ ను తీసుకున్నాడు. అది కూడా తనకి అచ్చోచ్చిన కామెడీ బ్యాక్డ్రాప్ లో. లాజిక్స్ పక్కన పట్టేసి కేవలం నవ్వించడం టార్గెట్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు తరుణ్ భాస్కర్. 

ఇది ఒక రొటీన్ క్రైమ్ కామెడీ సినిమా. కానీ ప్రెజెంట్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. వాస్తు, లంచం పాత్రలతో కోర్టు సన్నివేశంతో మొదలైన ఈ సినిమా.. జీవన్‌ గ్యాంగ్‌, ఆ వెంటనే నాయుడి పాత్ర ఎంట్రీతో కథలో వేగం పెరుగుతుంది. శ్వాసమీద ధ్యాస, రోజుకు గంట ఇంగ్లీష్‌ అంటూ నాయుడు చేసే కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. దాదాపు మొదటి భాగం అంతా సరదా సన్నివేశాలతో ఫస్టాఫ్‌ని ముగించేశాడు దర్శకుడు.        

ఇక రెండో భాగంలో కూడా కథలో పెద్దగా మార్పులు ఉండవు. ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగానే ముందుకు సాగుతుంది. మధ్యలో గెటప్ సీన్ కాస్త నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. ఇక క్లిమక్స్ లో వచ్చే సీన్స్ కూడా రొటీన్ గానే ఉండటంతో రొటీన్ కథ చుసిన ఫీలింగ్ కలుగుతుంది ఆడియన్స్ కు. కానీ తరుణ్ భాస్కర్ చేసే కామెడీ సీన్స్ మాత్రం ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ సీన్స్ తప్పా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు అనిపిస్తుంది సినిమాలో.

ఎవరెలా చేశారు: దర్శకుడిగానే కాదు, నటుడిగా కూడా తన మార్క్ చూపించాడు తరుణ్ భాస్కర్. నాయుడు పాత్రలో ఆయన చేసిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి తరుణ్ భాస్కర్ పాత్ర ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఇక వాస్తు పాత్ర కోసం చైతన్య రావు కూడా చాలా కష్ట పడ్డాడు. లాయర్‌ లంచం పాత్రలో కనిపించిన రాగ్‌ మయూర్‌, విష్ణు తనదైన కామెడీతో నవ్వించారు. ఇక తాతగా బ్రహ్మానందం పాత్రకి పెద్దగా స్కోప్ లేదు.. ఉన్నకాసేపు నవ్వించారు. ఇక మిగతా పాత్రలు కూడా పరిధి మేర ఆకట్టుకుంటాయి. 

సాంకేతిక నిపుణులు: కీడా కోలా సాంకేతికంగా చాలా బాగుంది. ఏజే అరోన్‌ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ అని చెప్పాలి. ఇక వివేక్‌ సాగర్‌ నేపథ్య సంగీతం సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. పాటలు కాస్త అటూ ఇటూగా ఉన్నా.. నేపధ్య సంగీతం మాత్రం సినిమాను నిలబెట్టింది. ఎడిటర్‌ గా కూడా బాగుంది. 

ఇక మొత్తంగా చెప్పాలంటే కీడా కోలా..  నవ్వించే రొటీన్ క్రైం కామెడీ థ్రిల్లర్.