పనిచేసుకుంటేనే బతికేది..ఎంబీబీఎస్​ ఎలా చదివేది?

  • పేదింటి బిడ్డకు నీట్​లో  979వ ర్యాంకు
  • సీటు వచ్చినా .. కొనసాగించాలంటే పైసల అడ్డంకి
  • ఆర్థిక సమస్యలతో తల్లిదండ్రుల సతమతం
  • దాతలు సాయం అందించాలని కీర్తి శరణ్య వేడుకోలు

పెద్దపల్లి, వెలుగు :  పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌‌పూర్​ కు చెందిన  కీర్తి శరణ్య పేద కుటుంబంలో పుట్టినప్పటికీ  పట్టుదలతో చదివి నీట్​లో 979 ర్యాంకు సాధించింది. ఎంబీబీఎస్ చదవాలన్న ఆమె లక్ష్యానికి ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారింది. తన చదువుకు సాయం చేయడానికి దాతల కోసం ఎదురుచూస్తోంది.    కీర్తి లక్ష్మయ్య–రాజేశ్వరి దంపతులకు  పెద్ద కూతురు శరణ్య.  స్థానిక  జడ్పీ హైస్కూల్లో టెన్త్​​, తాటిపల్లి గురుకుల కాలేజీలో ఇంటర్​ చదివింది.   నీట్​ తొలి రెండు ప్రయత్నాలు ఫెయిల్​అయినా మూడోసారి రాష్ట్రస్థాయిలో 979వ ర్యాంకు సాధించింది.  

ప్రస్తుతం శరణ్యకు కన్వీనర్ కోటాలోనే ఎంబీబీఎస్ సీటు దక్కుతుంది. ఆమెకు సీటు వచ్చిందన్న సంతోషం ఒకవైపు ఉంటే,  ఇంట్లో చిల్లిగవ్వ లేని పరిస్థితి మరోవైపు. అడ్మిషన్ ఫీజుతో పాటు బుక్స్, మెడికల్ కాలేజ్ లో జాయిన్​ అయిన తర్వాత ఎగ్జామ్​  ఫీజులు కట్టడం ఎలా అని శరణ్య బాధపడుతోంది. అలాగే శరణ్య సోదరి ఇటీవల పాలిటెక్నిక్​ పూర్తి చేసింది. బీటెక్​ చేయాలనుకుంటుంది.  కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ ప్రతీరోజు కూలి పనికి వెళ్లందే పూట గడవదు. గుంట పొలం గాని,  సొంత ఇల్లు గానీ లేవు. పని చేసుకుంటేనే బతికేది. ఇద్దరు కూతుళ్లను బాగా చదివించాలనేదే తన లక్ష్యమని లక్ష్మయ్య చెప్తున్నాడు. తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్టే కూతుర్లు కూడా చదువులో ముందున్నారు.  దాతలు ఎవరైనా ఉంటే 9505365890  నంబర్​లో తమను సంప్రదించి సాయం అందించాలని శరణ్య వేడుకుంటోంది.