
దసరా, నాయకుడు చిత్రాలతో నటిగా మరోసారి తన మార్క్ చూపించిన కీర్తి సురేష్.. ‘భోళా శంకర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిరంజీవికి చెల్లెలుగా ఆమె ఇందులో నటించింది. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 11న విడుదలవుతున్న సందర్భంగా కీర్తి సురేష్ సినిమా విశేషాలను ఇలా పంచుకుంది.
‘‘‘భోళా శంకర్’ అనేది ప్రధానంగా అన్నా చెల్లెలి కథ. బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్‌తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే ఎంటర్‌టైనర్. రజినీకాంత్ గారికి చెల్లెలుగా నటించిన ‘అన్నాత్తే’ పూర్తవగానే ఇందులో ఆఫర్ వచ్చింది. ఇద్దరు బిగ్ స్టార్స్‌తో వెంటవెంటనే నటించడం చాలా హ్యాపీగా ఉంది. చిరంజీవి గారితో ఒక్క ఫ్రేమ్‌లోనైనా డ్యాన్స్ చేయాలని వుండేది. సిస్టర్ క్యారెక్టర్ కనుక ఆ చాన్స్ మిస్ అవుతానేమో అని భయపడ్డా. కానీ ఇందులో రెండు పాటల్లో డ్యాన్స్ చేసే చాన్స్ దక్కింది. ‘పున్నమినాగు’లో చిరంజీవి గారితో నటించిన మా అమ్మ... ఎయిటీస్ గ్రూప్‌లో ఆయనకు ఫ్రెండ్ అయితే ఇప్పుడు నేను కొత్త ఫ్రెండ్‌ని. ‘మీ అమ్మ చాలా అమాయకురాలు. నువ్వు చాలా స్మార్ట్’ అనేవారు. ఇక ఇందులో తమన్నా.. కామెడీ చాలా బాగా చేశారు. ఆమె ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో వున్నారు. ఒకేసమయంలో ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్‌తో నటించడం, అవి ఒకేసారి విడుదల కావడం తమన్నా అదృష్టం. డైరెక్టర్ మెహర్ రమేష్ గారికి కమర్షియల్ మీటర్, ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. ఆయన్ని నేనొక అన్నయ్యలా భావిస్తాను. ఇక హీరోయిన్‌గా నటిస్తూనే, ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు, కీలకమైన పాత్రలు చేయడం చూడటానికి ఈజీగా ఉంటుంది. కానీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం (నవ్వుతూ). అన్ని రకాల చిత్రాల్లో నటించాలనేది నా కోరిక. పదేళ్ల తర్వాత వెనక్కు తిరిగి చూస్తే ఫలానా జానర్ మనం చేయలేదే అని అనిపించకూడదు. అందుకే సాధ్యమైనన్ని పాత్రలు చేస్తున్నా’’