
హిందీలోనూ తన మార్క్ చూపించాలని, అక్కడా విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్న కీర్తి సురేష్.. మరోవైపు ఓటీటీ కంటెంట్‌తోనూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇక తమిళంలోనూ ఆమె వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో సూర్యకు జంటగా ఆమె నటించబోతున్నట్టు సమాచారం. ‘లక్కీ భాస్కర్’తో మరో సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి ‘796 సీసీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
మారుతీ కార్లు మన దేశానికి తీసుకొచ్చిన నేపథ్యంలో సాగే పిరియాడిక్ మూవీ ఇదని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా చాలా పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా కీర్తి సురేష్‌ను సంప్రదించినట్టు సమాచారం. గతంలో ‘గ్యాంగ్’ చిత్రంలో సూర్యకు జంటగా నటించింది కీర్తి సురేష్. ఇప్పుడు మరోసారి తనతో కలిసి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల రెండో వారం ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఈలోపు హీరోయిన్‌గా కీర్తినే ఫైనల్ అవుతుందా, మరొకరికి ఆ ఛాన్స్ దక్కుతుందో చూడాలి!