కీసరదే తొలి తెలుగు శాసనం

‘తొలుచువాండ్రే’ తొలి తెలుగు పదం.. కడప కలమళ్లది కాదన్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం

హైదరాబాద్, వెలుగు : ‘తొలుచువాండ్రు’ను తొలి తెలుగు శాసనంగా గుర్తించాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం డిమాండ్ చేసింది. కడప జిల్లాలోని కలమల్ల శాసనమే తొలి తెలుగు శాసనమని అక్కడ పరిశోధకులు వాదిస్తున్న నేపథ్యంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, దీకొండ నర్సింగరావు, బీవీ భద్రగిరీశ్, గుండం మోహన్ రెడ్డి, గుమ్మడిదల వెంకటరమేశ్, డాక్టర్ మండల స్వామి, అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నజీర్, కండాడై కృష్ణమాచార్యులు, బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని తొలి తెలుగు శాసనం/లేఖనంగా పేర్కొంటున్న ‘తొలుచువాండ్రు’ అనే అక్షరాలు రాసి ఉన్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ రాతి రాతలోని 5 అక్షరాలు 80 నుంచి 85 సెం.మీల ఎత్తుతో, 180 సెం.మీ.ల వెడల్పున చెక్కి ఉన్నాయి. ఈ రాతిరాతను లిపిపరంగా 5వ శతాబ్దానికి చెందినదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలోని పురావస్తుశాఖ తమ 1981--–82 సంవత్సరపు వార్షిక నివేదికలోని (1987 ప్రచురణ) 18వ పేజీలో 5 అంశంగా శాసనం ‘తొలుచువాండ్రు’గా ప్రకటించిందని గుర్తు చేశారు. తర్వాత ముందర భద్రగిరీశ్ ప్రచురించిన ‘ఇంద్రేశం ఒక పురాచారిత్రక సందేశం’, డా.మండల స్వామి ప్రచురించిన కవితాసంకలనం ‘పొగడ పూలదండ’ను కన్వీనర్ హరగోపాల్ ఆవిష్కరించారు.