కాంగ్రెస్‎తో పొత్తు లేదు.. ఢిల్లీలో ఒంటరిగానే తేల్చుకుంటాం: కేజ్రీవాల్

కాంగ్రెస్‎తో పొత్తు లేదు.. ఢిల్లీలో ఒంటరిగానే తేల్చుకుంటాం: కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పొత్తుపై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తాయని.. పొత్తుకు సంబంధించిన చర్చలు చివరి దశకు వచ్చాయని.. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారం తెలిసిందని ఓ నేషనల్ మీడియా ఛానెల్ పేర్కొంది. దీనిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‎తో ఎలాంటి పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు కేజ్రీ. 

సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‎తో ఎలాంటి చర్చలు జరపలేదని.. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. సింగిల్ పోటీ చేసి మూడో సారి ఢిల్లీలో అధికారం నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్, ఆప్ పొత్తు ప్రచారానికి చెక్ పడింది. కేజ్రీవాల్ తాజా స్టేట్మెంట్‎తో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్  రగనున్నట్లు తేటతెల్లం అయ్యింది. 

దేశ రాజధానిలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ఎన్నికల్లో తలపడనున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆప్, బీజేపీ ఇప్పటికే ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అధికార ఆమ్ ఆద్మీ అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టింది. ఎన్నికలకు మూడు నెలల ముందే ఏకంగా అభ్యర్థులను ప్రకటించి ఆప్ దూకుడు ప్రదర్శిస్తోంది. బీజేపీ సైతం ఢిల్లీ ఎన్నికల కసరత్తు షూరు చేసింది. ఎన్నికల కోసం కమిటీలను ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం ఎన్నికల రేసులో ఆప్, బీజేపీతో పోలిస్తే కాస్తా వెనకబడింది.