![ఆప్‌కు బిగ్ షాక్.. కేజ్రీవాల్, అతిశీ, సిసోడియా ముగ్గురు వెనకంజ](https://static.v6velugu.com/uploads/2025/02/kejriwal-atishi-and-manish-sisodia-trailed-in-the-counting-of-votes_wM0WiuoNFz.jpg)
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా బీజేపీ అధిక్యంలో దూసుకుపోతుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వెనకబడింది. ఆప్ ముగ్గురు అగ్రనేతలు వెనకంజలో పడ్డారు. న్యూఢిల్లీలో కేజ్రీవాల్, కల్కాజీలో సీఎం అతిశీ, జంగ్ పురాలో మనీష్ సిసోడియా బీజేపీ అభ్యర్థుల కంటే వెనకపడ్డారు. కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ లీడింగ్‌లో ఉన్నారు. కల్కాజీ స్థానంలో సీఎం అతిశీపై రమేష్ భిదూరి అధిపత్యం ప్రదర్శిస్తున్నారు.
జంగ్ పురాలో ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ప్రారంభం నుంచే ఎదురీదుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లలో వెనకబడ్డ సిసోడియా.. ఈవీఎం ఓట్ల లెక్కింపు లోనూ అదే తీరు కనబరుస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ 36 స్థానాలు, ఆప్ 23, కాంగ్రెస్ ఒక చోట అధిక్యంలో కొనసాగుతున్నాయి. ఆప్ అగ్రనేతలు వెనకబడటంతో ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు బీజేపీ సత్తా చాటుతుండటంతో కమలం పార్టీ శ్రేణులు సంబురాలకు సిద్ధమైతున్నారు.
Also Read :- ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశ మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను
శనివారం (ఫిబ్రవరి 8) ఉ.8 గంటలకు అధికారులు మొదలు పెట్టారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలను తెరవనున్నారు. ఎన్నికల కమిషన్ కౌంటింగ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాల దగ్గర 10 వేల మందిని మోహరించారు.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా.. అధికారం దక్కాలంటే 36 స్థానాల్లో విజయం సాధించాలి. మొత్తం 699 మంది అభ్యర్థుల భవితవ్యం శనివారం (ఫిబ్రవరి 8) మధ్యా్హ్నం వరకు తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోరు సాగగా.. కాంగ్రెస్ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేసింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపే మొగ్గుచూపాయి. 50కి పైగా సీట్లు గెలుస్తామంటూ బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.