కేజ్రీవాల్ కారుపై రాళ్లదాడి బీజేపీ గుండాల దుశ్చర్యే.. ఆప్​

కేజ్రీవాల్ కారుపై రాళ్లదాడి బీజేపీ గుండాల దుశ్చర్యే.. ఆప్​

 

  • కేజ్రీవాల్ కారే ఇద్దరిని ఢీకొట్టిందంటూ బీజేపీ ఆరోపణ

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ కారుపై రాళ్లదాడి జరిగింది. శనివారం న్యూఢిల్లీ నియోజకవర్గంలోని లాల్ బహదూర్​ సదన్ ఏరియాలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేజ్రీవాల్​ కారుపై దాడి చేసి ప్రచార కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆప్ ఆరోపించింది. మరోవైపు కేజ్రీవాల్ కారే ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టిందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ న్యూఢిల్లీ అభ్యర్థి పర్వేశ్​ వర్మ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కారుపై రాళ్లు విసిరిన వీడియోను సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఆప్ పోస్ట్ చేసింది. అందులో కారుపై రాయి పడిన, బీజేపీ కార్యకర్తలు నల్లజెండాలు ఊపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ‘‘ఓటమి భయంతో బీజేపీ తన గూండాలను కేజ్రీవాల్​పై దాడికి ఊసిగొల్పింది. 

ప్రచారం చేస్తుండగా బీజేపీ అభ్యర్థికి చెందిన గూండాలు కేజ్రీవాల్​పై రాళ్లు, ఇటుకలతో దాడికి పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయలేని విధంగా ఆయన్ను గాయపరిచేందుకు ప్రయత్నించారు” అని ఎక్స్ లో ఆప్ పోస్టు చేసింది. కాగా, కేజ్రీవాల్ కారుపై ఎటువంటి దాడి జరగలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. “కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది బీజేపీ కార్యకర్తలు ప్రశ్నలు అడగాలనుకున్నారు. దీంతో అక్కడ ఆప్, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితిని నియంత్రించడానికి రెండు వర్గాలను చెదరగొట్టాము” అని పోలీసులు తెలిపారు.

కిరాయికి ఉండెటోళ్లకు ఫ్రీ కరెంట్​, వాటర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మళ్లీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తు, తాగునీటి ప్రయోజనాలను కిరాయిలకు ఉండే వారికి కూడా వర్తింపజేస్తామని అర్వింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు.