- ప్రధాని మోదీకి అర్వింద్ కేజ్రీవాల్ సవాల్
న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ హామీ అమలు చేస్తే బీజేపీ తరఫున తాను ప్రచారం చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని, వాటికి ముందు 24 గంటల ఫ్రీ ఎలక్ట్రిసిటీ హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘జనతా కీ అదాలత్’ పేరిట ఢిల్లీలో ఆప్ నిర్వహించిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు.
మహిళల కోసం ఫ్రీ బస్ జర్నీ, వృద్ధుల కోసం తీర్థయాత్రల స్కీమ్లను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. వీటిని బీజేపీ దూరం చేయాలని కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. ‘‘మేము అధికారంలోకి వచ్చాక ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం.
విద్యుత్, వాటర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, హెల్త్, ఎడ్యుకేషన్ రంగాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. బీజేపీ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లు అన్నీ.. ‘డబుల్ లూటీ.. డబుల్ కరప్షన్’వే.. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లు అంటే.. ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం.
హర్యానా, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ గద్దె దిగడం ఖాయం. శనివారం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ ఇవే చెప్తున్నాయి. హర్యానాలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది’’అని కేజ్రీవాల్ అన్నారు.
240 సీట్లతోనే ఒక ఇంజిన్ ఫెయిల్
దేశంలో ఎక్కడెక్కడ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లు ఉన్నాయో.. అక్కడ పాలన అంతా విఫలమైందని కేజ్రీవాల్ విమర్శించారు. జూన్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లు సీట్లు వచ్చినప్పుడే ఫస్ట్ ఇంజిన్ ఫెయిల్ అయిందని అన్నారు. ‘‘ఇక రెండో ఇంజిన్ మెల్లిమెల్లిగా జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా ఫెయిల్ అవుతది.
డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటే అభివృద్ధి కాదని ప్రజలందరికీ అర్థమైంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పాటు అవినీతి పెరగడమని ప్రజలంతా ఫిక్స్ అయిపోయారు. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారు.
బీజేపీ పేదలకు వ్యతిరేకం. ఢిల్లీలో ప్రజాస్వామ్యమే లేదు. ఇక్కడ అంతా ఎల్జీ రూల్ మాత్రమే నడుస్తది’’అని కేజ్రీవాల్ విమర్శించారు.