కేజ్రీవాల్​ పవర్​ గేమ్​

మరో ఆరు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకు రానున్నాయి. 2013, 2015ల్లో రెండుసార్లు గెలిచిన ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​)కి ప్రస్తుతం రోజులు బాగోలేదని ఎనలిస్టులు చెబుతున్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన జనరల్​ ఎలక్షన్స్​లో ఆప్​ ఒక్క సీటునైనా గెలవలేక చతికిల పడింది. హిందీ బెల్ట్​లో ఎక్కడా ఆప్​ ఉనికి లేదు. పార్టీ పెట్టాక దాదాపు అయిదారేళ్ల పాటు కలిసున్న నాయకులు ఒక్కొక్కరిగా బయటకు పోవడంకూడా ఆప్​ కన్వీనర్​ కేజ్రీవాల్​లో ఒంటరితనం పెంచింది. దీంతో కేజ్రీ మరోసారి కరెంటు, మంచినీళ్ల పథకాలపైనే ఆధారపడ్డారు. వీటికి ఢిల్లీ జనాలు ఎంత వరకు టెంప్ట్​ అవుతారో చూడాలి.

విలువలతో కూడిన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్​గా చెప్పుకునే ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ జోరు కొంతకాలంగా తగ్గింది. 2017 నుంచి ఢిల్లీకి దగ్గరగా ఉండే దాదాపు ఆరేడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎక్కడా ‘ఆప్’ సత్తా చాటలేకపోయింది. కాస్తంత పట్టున్న పంజాబ్​లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చీలికలు పీలికలైంది. కేజ్రీవాల్ వైఖరితో వేగలేక వెళ్లిపోతున్నామంటూ చాలామంది సీనియర్లు పార్టీ నుంచి చీలిపోయి వేరే కుంపటి పెట్టుకున్నారు. కిందటేడాది చివరిలో జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో  కూడా కేజ్రీవాల్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. లేటెస్ట్​గా జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్​సభ నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకుంది. ఢిల్లీ వరకు కాంగ్రెస్​తో పొత్తు ఉంటుందని చివరిక్షణం వరకు అందరూ భావించారు. చివరకు ఆప్​తో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ ఉత్సాహం చూపలేదు. దేశ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకాకిలా మారిపోయింది.

ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు తరుముకొస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి.  దాదాపు 22 ఏళ్లుగా ఢిల్లీ గద్దెకి దూరంగా ఉన్న బీజేపీ    ఈసారి పాగా వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో  ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రంగంలోకి దిగారు.  ప్రజలపై వరాలు జల్లు కురిపిస్తున్నారు. తన మార్క్ సంక్షేమ పథకాలను మళ్లీ సిద్దం చేశారు. ప్రజలకు ఫ్రీగా కరెంటు ఇస్తానన్నారు. నెలకు 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే పైసా చెల్లించనక్కర్లేదన్నారు. అలాగే 201 నుంచి 400 యూనిట్ల వరకు కరెంటు వాడితే 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీ జనాభాలో 33 శాతం మందికి లాభం కలుగుతుంది. కేజ్రీవాల్ నిర్ణయాన్ని పొలిటికల్ జిమ్మిక్కుగా బీజేపీ కొట్టి పడేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను ఆకట్టుకోవడానికి కేజ్రీవాల్ ఇలాంటి  జిమ్మిక్కులు ప్రయోగిస్తున్నారని విమర్శించింది.

ఒక్కొక్కరుగా దూరమై… ఒంటరియై

అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో నుంచి పుట్టిన పార్టీ ‘ఆప్’. బ్యూరోక్రాట్​గా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ 2012లో ఈ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన రోజుల్లో ఆయనతో ఉన్న చాలామంది సీనియర్లు ఆ తర్వాత విభేదించి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. 2014లోనే  ఆప్​లో గొడవలు మొదలయ్యాయి. పార్టీలో మొదటినుంచి ఉన్న మహిళా నేత షాజియా ఇల్మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమెతో పాటు కెప్టెన్ గోపీనాథ్ కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. 2018లో ఇద్దరు సీనియర్ లీడర్లు అశుతోష్, ఆశీష్ ఖేతాన్ పార్టీకి గుడ్ బై కొట్టారు. అశుతోష్ రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ఆశీష్ ఖేతాన్ కూడా పార్టీ నుంచి వెళ్లిపోయారు. వీరిద్దరి రాజీనామాలతో ఆప్​లో అంతా ఓకే కాదన్న విషయం బయటపడింది. ఆ తర్వాతి వికెట్ పంజాబ్​కి చెందిన సీనియర్ లాయర్ హర్వీందర్ సింగ్ పుల్కాది. హక్కుల కార్యకర్తగా పుల్కా ఎంతో పేరున్న వ్యక్తి. రాజకీయాలకు కొత్త అర్థం చెబుతానన్న కేజ్రీవాల్ మాటలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో లూథియానా నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. కొంతకాలం పంజాబ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కేజ్రీవాల్​తో వచ్చిన గొడవల కారణంగా ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ  సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.  దీని ప్రభావం పంజాబ్​లోని ఆప్​పై పడింది. అసెంబ్లీలో పార్టీ నాయకుడిగా ఉన్న సుఖ్​పాల్ సింగ్ ఖైరాని పదవి నుంచి కేజ్రీవాల్ అకస్మాత్తుగా తొలగించారు. దీంతో ఖైరా తన విధేయులైన ఎమ్మెల్యేలతో కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఖైరాని పార్టీ నుంచి కేజ్రీవాల్ సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలన్నీ ఆప్​లో ఒక్క కేజ్రీవాల్ మాటే చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయానికి వీలు కల్పిస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్​లో వినపడుతోంది.

నీటి హామీని నిలబెట్టుకున్న  కేజ్రీవాల్

ప్రజలకు ఇచ్చిన హామీని ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబెట్టుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తారంటారు ఆయన గురించి బాగా తెలిసినవాళ్లు. సామాన్య ప్రజలందరికీ తాగునీటిని ఫ్రీగా ఇస్తామంటూ 2013 ఎన్నికల మేనిఫెస్టోలో కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని  కేజ్రీవాల్ నిలబెట్టుకున్నారు. నీటి మీటరు ఉన్న ప్రతి ఇంటికి నెలకు 20 కిలో లీటర్ల నీటిని ఫ్రీగా సప్లై చేశారు. సామాన్య ప్రజలను ఆకట్టుకున్నారు.

బీజేపీ వర్సెస్  ఆమ్ ఆద్మీ

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ శాఖకి నిన్న మొన్నటివరకు షీలా దీక్షిత్ పెద్ద దిక్కుగా ఉండేవారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఢిల్లీ రాజకీయాలపై ఆమెకు పట్టుంది. ఎక్కడ పార్టీ బలహీనంగా ఉందో, దానికి చేయాల్సిన చికిత్స  ఏమిటో ఆమెకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.షీలా దీక్షిత్​ మరణంతో పార్టీని నడిపించే లీడర్ ఎవరూ లేకుండా పోయారు. ఆమె మరణించి 15 రోజులవుతున్నా ఢిల్లీ పీసీసీ చీఫ్​గా ఎవరినీ అప్పాయింట్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ రాజకీయాల్లో  రెండు పార్టీలు (బీజేపీ, ఆప్​) మధ్యే పోటీ ప్రధానంగా
ఉండబోతోంది.

బీజేపీ  ‘మిషన్ 60’

ఢిల్లీ అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 70 సీట్లలో 67 సీట్లను ‘ఆప్’ గెలుచుకుంది. కేవలం మూడు సీట్లలోనే బీజేపీ కేండిడేట్లు గెలిచారు.  ఈసారి బీజేపీ 60 సీట్లు గెలుచుకోవాలని పక్కా ప్లాన్ తయారు చేసింది. అనేక రంగాల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ  ఫెయిల్యూర్స్​ని ప్రజలకు వివరించి అధికారానికి రావాలన్నది బీజేపీ ప్లాన్. ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో ఉన్న ఏరియాల్లో వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేపట్టారు బీజేపీ లీడర్లు. అక్కడి ప్రాంతాల్లో  కనీస వసతులు మెరుగుపరచడానికి  పథకాలు తయారు చేశారు.

మురికివాడల్లో మనోజ్ తివారి ప్రచారం

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ చాలాకాలం కిందటే సిద్దమైంది. ముందుగా వాల్మీకి సహా సిటీలోని అనేక స్లమ్ ఏరియాల్లో  ప్రచారం చేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ డిసైడ్ అయ్యారు. ఢిల్లీ స్లమ్ ఏరియాలు గతంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు గట్టి ఓటు బ్యాంకులుగా ఉండేవి. లేటెస్ట్​గా జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ పెద్ద సంఖ్యలో ఓట్లు పడ్డాయి. దీంతో స్లమ్ ఏరియాల్లో  ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకోవడానికి బీజేపీ లీడర్లు పక్కా ప్లాన్  రెడీ చేస్తున్నారు. బీజేపీ కేడర్​కూడా మంచి జోష్​లో ఉంది. కొద్దికాలంగా ఢిల్లీలో పోరంబోకు స్థలాల్లో కాలనీలు పెద్ద ఎత్తున వెలిశాయి. ఈసారి తమ ప్రభుత్వం  ఏర్పాటైతే, 90 రోజల్లోపునే కాలనీ ప్రజలకు పట్టాలు ఇస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు బీజేపీకి ముఖ్యమంత్రి కేండిడేట్ అంటూ ఎవరూ లేరు.  కాషాయ పార్టీకి ఇదొక మైనస్ పాయింట్ అంటున్నారు ఎనలిస్టులు.