ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సరికొత్త చర్చను తెరపైకి తెచ్చారు. భారతదేశంలో మధ్య తరగతి జీవితాలను టార్గెట్ చేస్తూ.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్ అయ్యారు. మధ్య తరగతి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుంది.. ఎలాంటి పన్నుల భారాన్ని మోపుతున్నది అనేది చెబుతూ.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు దగ్గరయ్యే వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు కేజ్రీవాల్. ఆప్ పార్టీ లేవనెత్తిన అంశాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావటం విశేషం.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. మధ్య తరగతి ప్రజలను ATMలా వాడుకుంటుందని.. మోదీ పన్నుల ఉగ్రవాదానికి మధ్య తరగతి కుటుంబాలు చిద్రం అవుతున్నాయంటూ బీజేపీ విధానాలను దుమ్మెత్తిపోశారు కేజ్రీవాల్. మధ్య తరగతి కుటుంబాలు వంటింట్లో వంట వడుకోవాలంటే భయపడుతున్నారని.. పప్పులు, ఉప్పులపై GST భారం పెరిగిందని.. ధరలను అమాంతం పెంచేయటంలో బీజేపీ సర్కార్ రికార్డ్ సృష్టించిందంటూ.. మధ్య తరగతి కుటుంబాలను ప్రచారాస్త్రంగా ఉపయోగించారు కేజ్రీవాల్.
మధ్య తరగతి కుటుంబాలు ప్రభుత్వాలకు పన్నులు చెల్లించే వాళ్లుగానే కనిపిస్తున్నారని.. ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం మధ్య తరగతి కుటుంబాలకు ఏం చేసిందని ప్రశ్నించారు కేజ్రీవాల్. మధ్య తరగతి కుటుంబం ఓ 10 లక్షల రూపాయల కారు కొనుగోలు చేస్తే.. 5 లక్షల రూపాయలు పన్నులు వేస్తున్నారని.. ప్రతిఫలంగా వాళ్లకు ప్రభుత్వం ఏం చెల్లిస్తుందని నిలదీశారు కేజ్రీవాల్. ప్రభుత్వాల నుంచి ఏమీ పొందని వారు మధ్య తరగతి వాళ్లే అంటూ చెప్పుకొచ్చారు కేజ్రీవాల్.
మధ్య తరగతి కుటుంబాలు పిల్లలను కనాలంటే ఆర్థిక భారంగా భావిస్తున్నారని.. ఇది నిజం కాదా అని ప్రశ్నించారు కేజ్రీవాల్. బిడ్డను కనే ముందు వారు పెంకంలో భారాన్ని చూస్తున్నారని.. రాబోయే రోజుల్లో మధ్య తరగతి కుటుంబాలు పిల్లలను ఎలా కనగలరని నిలదీశారు ఈ మాజీ సీఎం. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం.. తన బడ్జెట్ నిధులను పిల్లల చదువులు, వైద్యం కోసం ఖర్చు చేస్తూ.. మధ్య తరగతి ప్రజలకు అండగా నిలుస్తుందన్నారాయన.
రాబోయే బడ్జెట్లో మధ్య తరగతి కుటుంబాల కోసం.. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్లను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ 7 డిమాండ్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎదుట పెట్టారు.
కేజ్రీవాల్ 7 డిమాండ్లు ఇలా ఉన్నాయి:
1. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజులను నియంత్రించాలి. కేంద్ర బడ్జెట్ లో విద్యకు కేటాయిస్తు్న్న నిధులను 2 నుంచి 10 శాతానికి పెంచాలి.
2. మధ్య తరగతి కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవటానికి రాయితీ ప్రకటించాలి.
3. హెల్త్ ఇన్సూరెన్స్‌పై GST తొలగించాలి. కేంద్ర బడ్జెట్లో వైద్య రంగం బడ్జెట్‌ను 10 శాతానికి పెంచాలి.
4. ఆదాయ పన్ను పరిమితిని 10 లక్షల రూపాయల వరకు పెంచాలి.
5. నిత్యావసర సరుకులు, వస్తువులపై GST తొలగించాలి.
6. మధ్య తరగతి కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లకు పెన్షన్ పథకం తీసుకురావాలి.
7. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ ఇవ్వాలి. మధ్య తరగతి కుటుంబాలకు అమలు చేయాలి.
ఆప్ తన మ్యానిఫెస్టోలో ఈ డిమాండ్లపై పోరాటం చేయనున్నట్లు ప్రకటించింది. చూడాలి ఢిల్లీలోని మధ్య తరగతి కుటుంబాలు ఏ మేరకు కేజ్రీవాల్ వెంట నడుస్తారు అనేది..