
న్యూఢిల్లీ: మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోయారు. స్థానిక కోర్టు కేజ్రీవాల్ ను జూన్ 5 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ జూన్ 1 న ముగియడంతో ఆయన తిరిగి జైలుకు వెళ్లారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ పిటిషన్ ను దాఖలు చేసింది. అయితే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై ఉన్నందున దరఖాస్తు పెండింగ్ లో ఉంది. కేజ్రీవాల్ లొంగిపోయిన తర్వాత స్థానిక రాస్ అవెన్యూ కోర్టు డ్యూటీ జడ్జీ దరఖాస్తును స్వీకరించారు. కేజ్రీవాల్ ను జూన్ 5 వరకు జ్యుడిషయల్ కస్టడీకి పంపారు.
జైలులో లొం గిపోయే ముందు కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆప్ పార్టీ కార్యాలయానికి వచ్చిన కేజ్రీవాల్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
‘‘ నేను ఈ రోజు తిరిగి జైలుకు వెళ్తున్నాను.. అవినీతికి పాల్పడినందుకు కాదు.. నియంతృత్వానికి వ్యతిరేకంగా నా గొంతును వినిపించినందుకు’’ అని కేజ్రీవాల్ అన్నారు. ఆ విషయాన్ని ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సమయంలో అంగీకరించారన్నారు. ఈడీ 500 చోట్ల దాడులు చేసింది.. అయినా ఒక్క చోట పైసా కూడా రికవరీ చేయలేదు.. వారి వద్ద ఎలాంటి రుజువు లేదన్నారు కేజ్రీవాల్.
బీజేపీ మూడో సారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సర్వే ఫలితాలను కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫేక్.. రాజస్థాన్ లో బీజేపీ 33 సీట్లు వచ్చాయని ఒక ఎగ్జిట్ పోల్ ఇచ్చింది. అక్కడ కేవలం 25 సీట్లు మాత్రమే ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే.. కౌంటింగ్ మూడు రోజులముందు ఫేక్ ఎగ్జిట్ ఫోల్ ఎందుకు చేయాల్సి వచ్చింది.. దీనికి వెనక పెద్ద కుట్ర ఉందని అన్నారు కేజ్రీవాల్. ఈవీఎంలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.