మ్యాటర్ లీక్ అయింది.. ఢిల్లీ బీజేపీ CM అభ్యర్థి ఎవరో చెప్పేసిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిపై ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో రమేష్ బిధూరి పేరును బీజేపీ సీఎం అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారు. బీజేపీలో నాతో సన్నిహితంగా ఉండే నేతలు ఈ విషయం నాకు చెప్పారని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎంపికైన రమేష్ బిధూరి అభినందిస్తున్నా.. కానీ గత పదేళ్లుగా ఎంపీగా ఉన్నా ఆయన ఢిల్లీ కోసం ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రమేష్​ భిదూరి పేరు బీజేపీ ఢిల్లీ సీఎం ఫేస్‎గా అధికారికంగా ప్రకటించిన తర్వాత.. ఢిల్లీ ప్రజల ముందు బీజేపీ, ఆప్ సీఎం అభ్యర్థుల మధ్య డిబేట్ జరగాలని కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఢిల్లీలో కొత్త ఓటర్ల  నమోదుపై కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశాడు.

 ఎన్నికల్లో అక్రమ పద్దతిలో బీజేపీ ప్రయత్నిస్తోందని.. గెలుపు కోసం ఎన్నికల ప్రక్రియనే బీజేపీ బలహీనపరుస్తోందని విమర్శించారు. 2024 డిసెంబర్ 15 నుంచి జనవరి 8 మధ్య కేవలం 15 రోజుల వ్యవధిలోనే 13,000 మంది కొత్త ఓటర్లు చేరారని.. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల మంది ఓటర్లు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, బీహార్‎తో పాటు ఇతర పొరుగు రాష్ట్రాల నుండి నకిలీ ఓటర్లను బీజేపీ తీసుకొస్తోందని ఆరోపించారు. ఆప్ ను ఓడించడం కోసం బీజేపీ అవలంబిస్తోన్న అక్రమ పద్దతులు మొత్తం ఎన్నికల ప్రక్రియనే బలహీనపరుస్తోందని ధ్వజమెత్తారు.

ఇక, ఢిల్లీ బీజేపీ సీఎం క్యాండిడేట్ గా కేజ్రీవాల్ చెబుతున్న రమేష్ బిధూరి ఇటీవల దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇందుకు కారణం కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలే. కల్కాజీ అసెంబ్లీ నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న రమేష్ బిధూరి.. బీజేపీని గెలిపిస్తే.. కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా నున్నగా చేస్తామని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు. 

ఈ వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలకు దిగింది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గని రమేష్ బిధూరి ప్రియాంక గాంధీకి క్షమాపణలు చెప్పారు. రమేష్ బిధూరి వ్యాఖ్యలతో డ్యామేజీ  జరిగిందని బీజేపీ హై కమాండ్ సీరియస్ అయ్యిందని.. ఈ నేపథ్యంలోనే అతడి కల్కాజీ బరి నుండి తప్పిస్తారని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో రమేష్ బిధూరి బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ కేజ్రీవాల్ కామెంట్స్ చేయడం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‎లో హాట్ టాపిక్‎గా మారింది.