ఢిల్లీ లిక్కర్ స్కామ్ దెబ్బ.. జైలుకెళ్లొచ్చిన ఆప్ ముగ్గురు అగ్రనేతల ఓటమి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దెబ్బ.. జైలుకెళ్లొచ్చిన ఆప్ ముగ్గురు అగ్రనేతల ఓటమి

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ భారీగా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లొచ్చిన ముగ్గురు ఆప్ అగ్రనేతలు ఓటమి పాలుకావడమే ఇందుకు నిదర్శనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏకంగా అప్పట్లో ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్, డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా, మంత్రిగా ఉన్న సత్యేంద్రజైన్ తీహార్ జైలుకు వెళ్లారు. 

కేజ్రీవాల్ దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉండగా.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ దాదాపు రెండేళ్ల వరకు జైలు జీవితం గడిపారు. అనంతరం సుప్రీంకోర్టు వీరి ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చాక కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేసి.. ప్రజలు తనను అవినీతి పరుడు కాదని తీర్పు ఇచ్చాకే మళ్లీ ఢిల్లీ సీఎం పగ్గాలు చేపడతానని శపథం చేశారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఎన్నికల బరిలో నిలిచారు.

 కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగగా.. సిసోడియా జంగ్ పురా, షత్పురపుర నుంచి సత్యేంద్రజైన్ పోటీలో  నిలిచారు. కానీ అనుహ్యంగా ఈ ముగ్గురు అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్లిన ఈ ముగ్గురు నేతలు ఓటమి పాలుకావడం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ తమను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిందని పదే పదే ఆరోపించిన ఆప్ నేతలు.. ఎన్నికల్లో జైలు సెంటిమెంట్ కలిసి వస్తుందని లెక్కలేసుకున్నారు.

 కానీ, జైలుకు వెళ్లి వచ్చారనే సానుభూతి చూపకుండా ముగ్గురుని ప్రజలు ఓడించడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ప్రధాన కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక, 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. దేశ రాజధానిలో బీజేపీ విజయఢంకా మోగించింది. ఆప్ వరుస విజయాలకు బ్రేకులు వేసిన బీజేపీ హస్తినా పీఠం దక్కించుకుంది.