మొత్తం కాపీ.. పేస్ట్.. బీజేపీ మేనిఫెస్టోపై కేజ్రీవాల్ సెటైర్స్

న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. బీజేపీ మేనిఫెస్టో కాపీ పేస్ట్ అని అభివర్ణించిన కేజ్రీవాల్.. ఆప్ హామీలను కాషాయ పార్టీ కాపీ కొట్టిందని ఆరోపించారు. బీజేపీ ఆప్‎నే అనుసరిస్తుందని.. అలాంటప్పుడు ఢిల్లీ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక లేని ఆ పార్టీని ప్రజలు ఎందుకు గెలిపించాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆప్ ప్రభుత్వం ఉచితాలు ఇస్తుందని విమర్శలు చేసే బీజేపీ నేతలు.. వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం ఉచితాల వర్షం కురిపించారని మండిపడ్డారు. ఇందుకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

అంతేకాకుండా..  కేజ్రీవాల్ చెప్పింది నిజమని ఒప్పుకుని.. ఉచితాలు దేశానికి హానికరం కాదు, భగవంతుని ప్రసాదం అని ప్రధాని మోడీ దేశ ప్రజలందరికి చెప్పాలన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో అమలు అవుతోన్న అన్ని పథకాలు కొనసాగుతాయని నడ్డా చెప్పారు.. దీంతో కేజ్రీవాల్ బాగా పని చేస్తాడు.. కేజ్రీవాల్ పథకాలను మేం కూడా కొనసాగిస్తామని బీజేపీ అంగీకరించినట్లైందని అన్నారు. మొహల్లా క్లినిక్‌లు కూల్చివేయాలని కోరుకునే వారు బీజేపీకి ఓటు వేయాలని.. మొహల్లా క్లినిక్‎లు కొనసాగాలంటే ఆప్‎ను ఆదరించాలని సూచించారు. “బీజేపీ మేనిఫెస్టో గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. కేజ్రీవాల్ చేస్తున్నది చాలా బాగుంది. మేం కేజ్రీవాల్ పనిని మెచ్చుకుంటున్నాం. ఢిల్లీ ప్రజలు ఈ సారి మాకు అవకాశం ఇస్తే మేము కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగిస్తాం’’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 

ALSO READ | బీజేపీ మ్యానిఫెస్టోలో ఫ్రీ.. ఫ్రీ.. : గర్జిణీలకు 21 వేలు, మహిళలకు నెలకు 2 వేల 500

ఢిల్లీ అభివృద్ధికిపై బీజేపీకి ఎలాంటి రోడ్ మ్యాప్ లేదని.. వారు ఆప్ మేనిఫెస్టోపై పోటీ చేయాలనుకుంటున్నారని సెటైర్ వేశారు. వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ శుక్రవారం (జవనరి 17) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆప్ మేనిఫెస్టో మాదిరిగానే.. మహిళలకు రూ.2,500 నెలవారీ సాయం, రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్లు, సీనియర్ సిటిజన్లకు రూ.2,500 పెన్షన్‌ వంటి 
స్కీములను బీజేపీ కూడా మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కాపీ పేస్ట్ అంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.