15 రోజుల్లో కేజ్రీవాల్ ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేస్తరు

15 రోజుల్లో కేజ్రీవాల్ ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేస్తరు
  • ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడి 

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. కేజ్రీవాల్ కుటుంబం 15 రోజుల్లో అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తుందని ఆప్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. " కేజ్రీవాల్ మరో15 రోజుల్లో తన  అధికారిక నివాసం అయిన ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాఫ్ రోడ్ బంగ్లాను ఖాళీ చేస్తారు. అంతేగాక..ప్రభుత్వం కల్పిస్తున్న వాహనాలను, సెక్యూరిటీ సహా అన్ని సౌకర్యాలను వదులుకుని సామాన్యుడిలా జీవించాలని నిర్ణయించుకున్నారు. 

కొత్త ఇంటి కోసం వెతుకుతున్నారు. కేజ్రీవాల్ ప్రజల మనిషి. ఆయన ఢిల్లీ ప్రజలతో  కలిసి జీవించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న నివాసం ఆయనకు సరైన భద్రతనిచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు రాబోతున్నారు. ఆయనకు వృద్ధ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉన్నారు. గతంలో కేజ్రీవాల్​పై అనేకసార్లు దాడి జరిగింది. ఇప్పుడు ఆయన భద్రతపై మేమంతా ఆందోళన చెందుతున్నాం. సెక్యూరిటీ కారణాలతో కేజ్రీవాల్ ను అధికారిక నివాసం నుంచి బయటకు రాకుండా ఆపాలని ప్రయత్నించాం. కానీ ఆయన బయటకు వెళ్లాలనే నిర్ణయించుకున్నారు" అని సంజయ్ సింగ్ వివరించారు.