ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్‎తో పొత్తుపై కేజ్రీవాల్ బిగ్ అనౌన్స్‎మెంట్

ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్‎తో పొత్తుపై కేజ్రీవాల్ బిగ్ అనౌన్స్‎మెంట్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పొత్తుపై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఏ పార్టీతో పొత్తు ఉండదని తెలిపారు. ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. సింగిల్ పోటీ చేసి మూడో సారి ఢిల్లీలో అధికారం నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని పొలిటికల్ సర్కిల్స్‎లో ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‎తో పొత్తు అంశంపై ఆదివారం (డిసెంబర్1) పలువురు కేజ్రీవాల్‎ను ప్రశ్నించగా.. ఏ పార్టీతో అలయెన్స్ పెట్టుకోమని.. ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పారు. కేజ్రీవాల్ ప్రకటనతో కాంగ్రెస్, ఆప్ పొత్తుపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. ఆప్ కంటే ముందు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని.. ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆప్ రెండు పార్టీలు పొత్తుపై క్లారిటీ ఇవ్వడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది.

బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ఎన్నికల్లో తలపడనున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆప్, బీజేపీ ఇప్పటికే ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అధికార ఆమ్ ఆద్మీ అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టింది. ఎన్నికలకు మూడు నెలల ముందే ఏకంగా అభ్యర్థులను ప్రకటించి ఆప్ దూకుడు ప్రదర్శిస్తోంది. మరోవైపు మాజీ సీఎం కేజ్రీవాల్లో పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లారు.