దమ్ముంటే బహిరంగంగా యమునా నీరు తాగండి: మోడీ, రాహుల్‎కు కేజ్రీవాల్ ఛాలెంజ్

దమ్ముంటే బహిరంగంగా యమునా నీరు తాగండి: మోడీ, రాహుల్‎కు కేజ్రీవాల్ ఛాలెంజ్

న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘యుమునా వాటర్’ ఇష్యూ కాకరేపుతోంది. యమునా నది నీటిని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ సైతం కేజ్రీవాల్ కామెంట్స్‎పై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే యమునా నీటిని విషపూరితం చేస్తున్నారంటూ కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మోడీ ఫైర్ అయ్యారు. 

మేం తాగేది కూడా యమునా నది నీటినే అని అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మోడీ. కేంద్ర హంశాఖ మంత్రి అమిత్ షా సైతం ఇదే విధంగా కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ క్రమంలో యమునా వాటర్ ఇష్యూపై కేజ్రీవాల్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం కేజ్రీవాల్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా నుంచి ఢిల్లీకి సరఫరా అవుతున్న యమునా నీటిలో అమ్మోనియా స్థాయిలు దాదాపు 3 పీపీఎం ఉంటాయి. కానీ జనవరి 21 తర్వాత అది 7 పీపీఎంకు పెరిగిందని అన్నారు. 7 పీపీఎం ఉన్న నీరు విషంతో సమానమని కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీ దమ్ముంటే 7 పీపీఎం ఉన్న యమునా నీటిని బహిరంగంగా తాగాలని కేజ్రీవాల్ ఛాలెంజ్ విసిరారు. ఎన్నికలకు ముందుకు నీటిని కలుషితం చేసి ఢిల్లీలో  నరమేధం సృష్టించి.. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నించిందని ఆప్ అధినేత ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసం బీజేపీ ఢిల్లీ ప్రజలు జీవితాలను ప్రమాదంలో పడేస్తోందని మండిపడ్డారు.  మరీ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తోందో చూడాలి మరీ. ఇదిలా ఉంటే.. 2025, ఫిబ్రవరి 8న ఎన్నికలు, 8న కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి.