న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంబేద్కర్ గురించి మాట్లాడటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందని.. పదే పదే అంబేద్కర్ పేరు చెప్పే కంటే దేవుడి పేరు స్మరించినా స్వర్గానికి వెళ్లేవారు అంటూ అమిత్ షా చేసిన కామెంట్స్ రెండు రోజులుగా పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేశాయి. ఈ వ్యాఖ్యలను ఆయుధంగా మల్చుకున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అమిత్ షా నిండు సభలో అంబేద్కర్‌ను అవమానించారని.. యావత్ దేశానికి క్షమాపణ చెప్పి ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ గురువారం ఢిల్లీలో ఆందోళనలకు దిగింది. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబును ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఇరకాటంలో పెట్టారు. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు వైఖరి ఏంటో స్పష్టం చేయాలని కోరారు.
ఈ మేరకు చంద్రబాబుకు కేజ్రీవాల్ బహిరంగ లేఖ రాశారు. ‘‘బాబా సాహెబ్‌ను అమిత్ షా అవమానించారు.. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు.. ప్రధాని మోదీ కూడా ఆయననే సమర్థిస్తున్నారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందనేంటో తెలియజేయాలి. మీరు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రజలు ఆశిస్తున్నారు’’ అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు.
కేజ్రీవాల్ రాసిన లేఖతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో అమిత్ షా వ్యాఖ్యల విషయంలో ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైంది చంద్రబాబు పరిస్థితి. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిద్దామంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగం. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందిస్తే బీజేపీ హై కమాండ్ పెద్దలు కన్నెర్ర చేసే అవకాశం ఉంది.
ALSO READ : పార్లమెంట్ బిల్డింగ్ ఎక్కి.. జై భీం అంటూ ఎంపీల నిరసన
అలాగని అమిత్ షా వ్యాఖ్యలను ఖండించకుండా సెలైంట్‌గా ఉంటే టీడీపీకి యావత్ దళిత జాతి వ్యతిరేకం అయ్యే ఛాన్స్ ఉంది. సరిగ్గా ఈ పాయింట్ చూసే ఎన్డీఏ సర్కార్‌లో కీ రోల్ ప్లే చేస్తోన్న చంద్రబాబును కేజ్రీవాల్ టార్గెట్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలపై చంద్రబాబు వైఖరి ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. షా వ్యాఖ్యలను ఖండిస్తారా..? కామ్‌గా ఉంటారా అనేది వేచి చూడాలి.