ఫలితాల విడుదలకు ముందే ఢిల్లీలో బిగ్ ట్విస్ట్.. 16 మంది అభ్యర్థులకు బీజేపీ గాలం..!

ఫలితాల విడుదలకు ముందే ఢిల్లీలో బిగ్ ట్విస్ట్.. 16 మంది అభ్యర్థులకు బీజేపీ గాలం..!

న్యూఢిల్లీ: మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపు జెండా ఎగరేస్తుందనే దానిపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు ముగియగానే వెలువడిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్.. ఢిల్లీలో బీజేపీదే అధికారమని అంచనా వేశాయి. గత మూడు పర్యాయాలు అప్రతిహత విజయాలు సాధిస్తూ వచ్చిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ సారి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. 

ఫలితాల విడుదలకు ముందే బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తోందని ఆరోపించారు. ఆప్‎కు చెందిన 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీజేపీ ఫోన్ చేసింది. బీజేపీలోకి వస్తే ఒక్కొక్కరికి రూ.15 కోట్లతో పాటు మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ ఇచ్చిందని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. మెజార్టీ ఎగ్జిట్స్ పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చేశాయి. అలాంటప్పుడు బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను ఎందుకు ప్రలోభాలకు గురి చేస్తోంది..? అంటే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని.. అవి ఫేక్ సర్వేలని బీజేపీ ఒప్పుకుందని పేర్కొన్నారు.

కానీ ఆప్ అభ్యర్థులు ఒక్కరు కూడా బీజేపీ ఆఫర్లకు లొంగరని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. సుల్తాన్‌పూర్ మజ్రా ఆప్ అభ్యర్థి ముఖేష్ అహ్లావత్ సైతం ఇదే తరహా కామెంట్స్ చేశారు. ‘‘నాకు బీజేపీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతోంది. ఆప్‎ను వీడి మా పార్టీలోకి వస్తే.. మంత్రి పదవితో పాటు రూ.15 కోట్లు ఇస్తాం’’ అని ఆఫర్ ఇచ్చారని ఆయన తెలిపారు. 

కానీ కేజ్రీవాల్ పార్టీలో నాకు ఇచ్చిన సుముచిత గౌరవ కారణంగా నేను చనిపోయే వరకు ఆప్‎ను వీడనని వాళ్లకు చెప్పానని అన్నారు. మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయ్యింది. ఫలితాల విడుదలకు ముందే ఓటమి భయంతో కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని.. బీజేపీ ఆప్ అభ్యర్థులను ఎవరిని ప్రలోభాలకు గురి చేయలేదని ఆప్ అధినేత ఆరోపణలను ఖండించింది. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ హెచ్చరించింది.