న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ రావడంతో శుక్రవారం (సెప్టెంబర్ 13) బయటికొచ్చిన కేజ్రీవాల్.. తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 15) ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 48 గంటల్లో సీఎం పదవికి రిజైన్ చేస్తానని ప్రకటించి ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ బాంబ్ పేల్చారు. రెండు రోజుల్లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి నియమాకంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మళ్లీ ప్రతి ఇంటికి, వీధికి వెళ్తానని, ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనని తెగేసి చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ఇక ప్రజల చేతుల్లోనే ఉందని.. నాపై నమ్మకం ఉంటేనే ఓటేయండని విజ్ఞప్తి చేశారు.
Also Read :- CM మమతా బెనర్జీని మరోసారి అవమానించిన జూడాలు
అనంతరం బీజేపీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. తనను, ఆమ్ ఆద్మీ పార్టీని విచ్చిన్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలు తన శిలలాంటి సంకల్పం ముందు నిలువవని.. నిరంతరం దేశం కోసం పోరాడుతూనే ఉంటానని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కేంద్రలోని ఎన్డీఏ సర్కార్ బ్రిటిష్ వలస పాలన కంటే ఎక్కువ నియంతృత్వ పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఆప్ సీనియర్ నేతలు సత్యేందర్ జైన్, అమానతుల్లాఖాన్‌లు కూడా త్వరలోనే జైలు నుండి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
జైల్లో ఉన్న సమయంలో తనకు, ఆప్ ప్రభుత్వానికి అండగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ఈ సందర్భంగా కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించిన బీజేపీపై పోరాటం ఆగదని మరోసారి తేల్చిచెప్పారు కేజ్రీవాల్. కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ అరెస్ట్ చేసిన కేసులో ఇటివలే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.