బెంగళూరు ఎయిర్పోర్ట్లో కానరాని హిందీ.. ఓన్లీ ఇంగ్లీష్, కన్నడ.. రేగిన దుమారం

బెంగళూరు ఎయిర్పోర్ట్లో కానరాని హిందీ.. ఓన్లీ ఇంగ్లీష్, కన్నడ.. రేగిన దుమారం

బెంగళూరు: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిస్ ప్లే బోర్డుల్లో హిందీ తొలగించడం చర్చనీయాంశమైంది. ఎయిర్ పోర్ట్ డిస్ ప్లేలో ఇకపై ఇంగ్లీష్, కన్నడలో మాత్రమే విమానాల రాకపోకలకు సంబంధించిన సమాచారం ఉంటుందని జరిగిన ప్రచారం వివాదానికి దారి తీసింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డిస్ ప్లే బోర్డుల్లో హిందీని తొలగించినట్టుగా వైరల్ అయిన వీడియోకు దాదాపు 2 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం.

Also Read : ఢిల్లీలో ఈదురుగాలుల బీభత్సం

ఈ పరిణామాన్ని కన్నడిగులు హర్షిస్తుంటే.. కొందరు నెటిజన్లు మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. కన్నడ, ఇంగ్లీష్ తెలిసిన వాళ్లు మాత్రమే బెంగళూరుకు వస్తారని భావిస్తున్నారా..? బెంగళూరు మెట్రో స్టేషన్లలో సమాచారాన్ని హిందీలో డిస్ ప్లే చేయకపోవడంలో అర్థముంది. కానీ.. బెంగళూరు ఎయిర్ పోర్టులో, రైల్వే స్టేషన్లో సమాచారాన్ని హిందీలో డిస్ ప్లే చేయకపోవడం సమంజసం కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

కర్ణాటకలో కన్నడ భాష మాత్రమే కనిపించాలని, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వ్యాపార సంస్థల బోర్డులు, దుకాణాల బోర్డులు కనిపిస్తే తొలగిస్తామని ‘కన్నడ రక్ష వేదికె’ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఉంటూ కన్నడ భాష మాట్లాడటం రాని వాళ్లపై కొందరు స్థానికులు వాగ్వాదానికి దిగిన ఘటనలూ గతంలో చూశాం. దుకాణాలు, వాణిజ్య సంస్థలు తమ సైన్‌బోర్డ్‌లలో కనీసం 60 శాతం కన్నడ భాషలోనే ఉండేలా చూసుకోవాలని మహానగర పాలికే ఆదేశాలు కూడా బెంగళూరు నగరంలో అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.