ఎంతటి దుర్మార్గుడినైనా క్షమించే మనుషులు ఉంటారు. చావు బతుకుల్లో ఉన్నప్పుడు తోచిన సాయం చేయాలి అనుకుంటారు. కానీ.. కెన్ రెక్స్ మెక్‌ల్రాయ్ చనిపోతుంటే ఊరంతా నిలబడి చూశారు. సొంతూరిలోనే అతన్ని తుపాకీతో కాల్చి చంపుతున్నా.. ఒక్కరు కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. కనీసం ఎవరూ దగ్గరికి రాలేదు. అంబులెన్స్‌కు ఫోన్‌చేయలేదు. అంతేకాదు.. అతన్ని ఎవరు చంపారో పోలీసులకు కూడా తెలియకుండా దాచారు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు. ఇప్పటికీ అతన్ని ఎవరు చంపారనేది మిస్టరీనే.
కెన్ రెక్స్ మెక్‌ల్రాయ్ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల గూండాగా మారాడు. దాడులు చేయడం, ఆడపిల్లల్ని వేధించడం, అత్యాచారాలు, దోపిడీ, దొంగతనాలు... ఇలా అతను చేయని నేరం లేదు. వాటికి సంబంధించి ఎన్నో నేరారోపణలు ఉన్నాయి. కానీ.. ఆ నేరాలన్నింటి నుంచి తప్పించుకున్నాడు.
అమెరికాలోని మిస్సౌరీ స్టేట్‌లో ఉన్న స్కిడ్‌మోర్ అనే పట్టణంలో ఉండేవాడు కెన్. అతను ఒక పేద కౌలు రైతు కుటుంబంలో పుట్టాడు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దాంతో చదువు మానేశాడు. అలా కొన్నేండ్లు గడిచాయి.18 సంవత్సరాల వయసులో ఉండగా అతని తలపై స్టీల్‌రాడ్‌పడి చాలా పెద్ద గాయమైంది. ఆ గాయం వల్ల చాలా రోజులు ఇబ్బంది పడ్డాడు. గాయం తగిలిన కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయి. కొన్నిసార్లు వింతగా ప్రవర్తించేవాడు. కొన్నాళ్లకు నేరాలు చేయడం మొదలుపెట్టాడు. అందుకే అతను వీధిలో నుంచి వెళ్తున్నప్పుడు చాలామంది భయపడేవాళ్లు.
హ్యాపీ లైఫ్
కెన్‌మాత్రం హాయిగా బతికేవాడు. తన భూమికి ఆనుకుని ఉన్న కొంత భూమిని లీజుకు తీసుకుని అందులో వ్యవసాయం చేసేవాడు. కుక్కలను అమ్మడం, కొనడం చేస్తుండేవాడు. కుక్కల రేసుల్లో పందేలు కాసేవాడు. డబ్బు సరిపోకపోతే.. పశువులు, ధాన్యం, మద్యం, గ్యాసోలిన్, యాంటిక్స్ దొంగిలించి అమ్ముకునేవాడు. వీటన్నింటితో హాయిగా ఉండేవాడు. కానీ.. ఏ కేసులో ఇరుక్కుంటానో అని ఎప్పుడూ భయపడేవాడు. అతని లాయర్ చెప్పిన దాని ప్రకారం.. కెన్ సంవత్సరానికి కనీసం మూడు నేరాలు చేసేవాడు. కొన్ని లెక్కల ప్రకారం అతనిపై 21 సార్లు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ.. ఒక్కసారి మాత్రమే నేరం రుజువైంది. మిగతా అన్నిసార్లు పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నాడు. అతని లాయర్ రిచర్డ్ జీన్ మెక్‌ఫాడిన్ చాలా తెలివైన వాడు. ఎలాంటి కేసు నుంచైనా కెన్‌ని తప్పించేవాడు. ఆ ధైర్యంతోనే కెన్ ధైర్యంగా తప్పులు చేసేవాడు.
జైలు నుండి తప్పించుకునేందుకు
కెన్ శిక్ష నుంచి తప్పించుకోవడానికి సాక్షులను భయపెడుతుంటాడు. అందుకోసం వాళ్లను ఫాలో అయ్యేవాడు. లేదంటే.. వాళ్ల ఇంటి బయట వెయిట్ చేస్తుండేవాడు. దాంతో అతను ఏదైనా చేస్తాడేమోననే భయంతో చాలామంది అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ధైర్యం చేసేవాళ్లు కాదు. కెన్ పన్నెండేండ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం చేశాడని ఊళ్లోవాళ్లు చెప్పుకునేవాళ్లు. అంతేకాదు.. ఓ కేసులో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు14 ఏండ్ల ట్రెనాను పెండ్లి చేసుకున్నాడు. కెన్ చనిపోయేవరకు ట్రెనా అతనితోనే ఉంది. ఆమె అతనికి మూడో భార్య.
భార్యలకు మంచివాడే!
బయట ఎన్ని తప్పులు చేసినా భార్యల దృష్టిలో మాత్రం కెన్ మంచివాడిగానే ఉన్నాడు. అతని గురించి బయట చెప్పేవన్నీ అబద్ధాలే అంటారు వాళ్లు. కెన్‌వల్ల ట్రెనా ఒక బిడ్డని కన్నది. ఆ తర్వాత ట్రెనా తన పుట్టింటికి పారిపోవాలి అనుకుంది. దాంతో ట్రెనా వాళ్ల అమ్మానాన్నలు ఉంటున్న ఇంటిని తగలబెట్టేశాడు. వాళ్ల కుక్కను కాల్చి చంపాడని చాలామంది చెప్తుంటారు. కానీ.. ట్రెనా మాత్రం కెన్ చనిపోయాక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వైరింగ్‌లో లోపం వల్ల ఫైర్ యాక్సిడెంట్‌జరిగి తన తల్లిదండ్రులు చనిపోయారు. వాళ్ల చావుకు కెన్‌కు ఎలాంటి సంబంధం లేదు. కెన్ చాలా మంచివాడని చెప్పింది. వాస్తవానికి ట్రెనా కంటే ముందు ఉన్న ఇద్దరు భార్యలను కూడా చాలా హింసించేవాడని జనాలు చెప్పుకునేవాళ్లు. కానీ.. ఆ ఇద్దరు భార్యలు షారోన్, ఎలిస్‌లు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా కెన్ మంచివాడే అని చెప్పారు. తమకి గృహ హింస తెలియదని చెప్పారు. కెన్ చనిపోయాక అతని గురించి వచ్చిన ఆరోపణలు విన్న ఎలిస్ ‘‘కెన్ గురించి ఇప్పుడు మేం వింటున్నదంతా అబద్ధమే. ఎందుకంటే.. కెన్ నాతో చాలా బాగా ఉండేవాడు. ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడు కాదు. కొన్ని విషయాల్లో వైల్డ్‌గా ఉండి ఉండొచ్చు. కానీ.. బయట చెప్పుకునే విధంగా మాత్రం ఎన్నడూ లేడు. అతను నిజాయితీగా ఉండే వ్యక్తి. ఉదార స్వభావం కలవాడు. అంతెందుకు అతను దొంగ అనే విషయం కూడా నాకు తెలియదు” అంటూ చెప్పింది.
పోలీసులే భయపడ్డారు
పోలీసులు కూడా కెన్‌ను ఎన్‌కౌంటర్ చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే.. అతని దగ్గర ఎప్పుడూ భారీగా ఆయుధాలు ఉంటాయి. పోలీసులంటే అతనికి లెక్కే లేదు. వాళ్లను కాల్చడానికి వెనకడుగు వేయడు. రెండు దశాబ్దాలపాటు అందర్నీ భయపెట్టాడు అతను.
బోవెన్‌క్యాంప్‌తో గొడవ
ఏప్రిల్ 25, 1980న బోవెన్‌క్యాంప్ అనే వ్యక్తి నడుపుతున్న జనరల్ స్టోర్‌కు వెళ్లింది కెన్ ఎనిమిదేళ్ల కూతురు టోన్యా. అక్కడ ఆమె ఒక క్యాండీ తీసుకుని, దానికి డబ్బులు ఇవ్వలేదు. స్టోర్ క్లర్క్ ఎవెలిన్ సుమీ ఆ స్వీట్‌ని తిరిగి ఇవ్వమని అడిగింది. దాంతో కెన్ ఆమెపై కోపగించుకుంటాడు. స్టోర్ ఓనర్ బోవెన్ అతనికి ఎదురు తిరిగాడు. అప్పటినుంచి అతను బోవెన్ క్యాంప్‌ను వెంబడించడం మొదలుపెట్టాడు.1980 జులై 8న బోవెన్ క్యాంప్ తన స్టోర్ వెనుక ఉన్న సందులోకి వెళ్లాడు. వెంటనే కెన్ అతన్ని షార్ట్‌గన్‌తో షూట్‌చేశాడు. దాంతో బోవెన్ క్యాంప్ ఫ్యామిలీ అతని మీద కేసు పెట్టింది. ఈ కేసు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఆగస్టు 18న మొదలైంది. కానీ.. ఈ కేసులో కూడా సాక్ష్యం లేకుండా చేసేందుకు కెన్ ప్రయత్నించాడు. బోవెన్ క్యాంప్ కుటుంబాన్ని, వాళ్ల సపోర్టర్స్‌ని భయపెట్టడానికి కెన్ ప్రయత్నించాడు. ఇన్వెస్టిగేషన్‌కు ముందు కెన్ రాత్రిళ్లు వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడే కూర్చునేవాడు. కొన్నిసార్లు.. తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి భయపెట్టేవాడు.
ఆలస్యం
చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని కెన్ ఈ కేసును ఎక్కువసార్లు వాయిదా పడేటట్టు చేశాడు. అలా ఐదు నెలలు గడిచాక 1981 జూన్ 25న విచారణ జరిగింది. కానీ.. కారణం లేకుండానే ప్రాసిక్యూటింగ్ అటార్నీ రాజీనామా చేశాడు. తర్వాత డేవిడ్ బైర్డ్ అనే యంగ్ ప్రాసిక్యూటర్‌ని అతని స్థానంలో నియమించారు. అయితే.. అంతకుముందు ఉన్న ప్రాసిక్యూటర్‌ని కెన్ వేధించడం వల్లే రాజీనామా చేశాడని కొందరు చెప్పారు. కొత్త ప్రాసిక్యూటర్ డేవిడ్ బైర్డ్ లా స్కూల్‌నుంచి బయటికి వచ్చి అప్పటికి కేవలం మూడేండ్లు మాత్రమే అవుతోంది. అయినా.. కెన్ నేర చరిత్రలో మరే ఇతర లాయర్ చేయలేని పని బైర్డ్ చేసి చూపించాడు. అతన్ని ఒక కేసులో దోషిగా నిరూపించాడు. దాంతో జ్యూరీ రెండేండ్లు శిక్ష విధించింది. వెంటనే అతని లాయర్ కెన్‌ని బెయిల్‌పై బయటికి తీసుకొచ్చాడు. కేవలం ఒక్కరోజు మాత్రమే జైల్లో ఉన్నాడు.
మళ్లీ అరెస్ట్
కెన్ విడుదలైన వెంటనే విచిత్రంగా పట్టణంలోని బార్‌లో రైఫిల్, బయొనెట్‌తో కనిపించాడు. అక్కడ అతను బోవెన్‌క్యాంప్ హత్య గురించి మాట్లాడటం గమనించిన పోలీసులు మళ్లీ అతన్ని అరెస్ట్ చేశారు. ఆయుధాలతో ఉన్నందుకు, బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు. కానీ.. వెంటనే వదిలేశారు. ఈ కేసు విచారణ 1981 జులై 20న ఉంది. అంతకు ముందే 1981 జూలై 10న ఉదయం ఆ టౌన్‌లోని లెజియన్ హాల్‌లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో నగర మేయర్‌తోపాటు 60 మంది స్కిడ్‌మోర్ నివాసితులు పాల్గొన్నారు. కెన్‌ను అడ్డుకోవడానికి చట్టబద్ధంగా ఏమి చేయొచ్చనేది చర్చించడానికే ఆ మీటింగ్‌పెట్టుకున్నారు. అదే టైంలో డ్రింక్స్ కొనుక్కోవడానికి కెన్ అతని భార్య ట్రెనాతో కలిసి అటునుంచే వెళ్తున్నట్టు ఒకరు చెప్పారు. దాంతో ఆ సమావేశం వాయిదా వేసి, ఆ 60 మంది బయటికి వచ్చారు.
కాల్పులు
అదే టైంలో ఎవరో కెన్‌ను చంపడానికి ప్లాన్‌చేశారు. వాళ్లలో కొందరు కెన్ ఉన్న బార్‌లోకి వెళ్లారు. ఇంకొందరు బయట వెయిట్ చేస్తున్నారు. ట్రక్‌లోని ప్యాసింజర్ సీట్‌లో ట్రెనా కూర్చుంది. కెన్ ట్రక్‌దగ్గరకు వచ్చి సిగరెట్ వెలిగించాడు. వెంటనే ట్రక్ వెనుక నుంచి ఎవరో రైఫిల్‌తో షూట్ చేశారు. దాంతో ట్రక్ అద్దాలు పగిలిపోయాయి. ట్రెనా భయంతో ట్రక్‌దిగి అక్కడినుంచి ఓ స్ట్రీట్‌లోకి పరిగెత్తింది. కెన్ తేరుకుని ఎదురుదాడి చేసేలోపే గుండెలో బుల్లెట్లు దిగాయి. అలా 47 ఏండ్ల వయసులో కెన్ చనిపోయాడు. అయితే.. అతన్ని ఎవరు చంపారనేది ఇప్పటివరకు మిస్టరీనే. అతను చనిపోయినప్పుడు అక్కడ దాదాపు 90 మంది ఉన్నారు. అందరూ హంతకులను చూశారు. కానీ.. ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పలేదు. అంతెందుకు బుల్లెట్లు తగిలి చావు బతుకుల్లో ఉన్న కెన్ కోసం అంతమందిలో ఒక్కరు కూడా అంబులెన్స్‌కు ఫోన్‌చేయలేదు.
బోవెన్‌క్యాంప్ కుటుంబమేనా?
ఘటనా స్థలంలో 90 మంది వరకు ఉన్నా ఎవరు కాల్పులు జరిపారో చెప్పడానికి ట్రెనా తప్ప ఎవరూ ముందుకు రాలేదు. కాల్పులు జరిగిన ప్లేస్‌లోనే ఉన్న బోవెన్‌క్యాంప్ కూతురు చెరిల్ హుస్టన్ దుకాణం నుండి తుపాకీ పేలిన సౌండ్ వినిపించినట్టు ట్రెనా చెప్పింది. కానీ.. దాని గురించి మిగతా ఎవరూచెప్పలేదు.