రాజకీయ లబ్ధికోసమే భారత్​పై ట్రూడో కన్నెర్ర

రాజకీయ లబ్ధికోసమే భారత్​పై ట్రూడో కన్నెర్ర

ఖలిస్తానీ నేత  హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో  భారత్ హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను అనుమానితుడిగా పేర్కొంటూ  విచారణ  జరుపుతామని  కెనడా ప్రధాని ప్రకటించడం భారత్​కెనడా దౌత్య సంబంధాలను దెబ్బతీసింది.  కెనడా ప్రధాని  జస్టిన్ ట్రూడో భారత్ పట్ల అనుసరిస్తున్న  విధానాలను గర్హిస్తూ, భారత్ తమ దౌత్యవేత్తలను కెనడా నుండి వెనక్కి రప్పిస్తున్నది.  

కెనడా ఉద్దేశ పూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నదని, పైగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్తాన్ టెర్రరిస్టుల పట్ల సానుభూతి, మద్దతు కనబరుస్తూ, చివరికి కెనడా మంత్రివర్గంలో భారత్ వ్యతిరేకులకు స్థానం కల్పించడం పట్ల భారత్ తన  నిరసనను, ఆందోళనను వ్యక్తం చేస్తున్నది.ఈ నేపథ్యంలో  భారత్ లోని కొంతమంది  కెనడా  దౌత్యవేత్తలను దేశం విడిచి పెట్టి పోవాలని, కెనడాలోని భారత్  దౌత్యవేత్తలు కూడా భారత దేశానికి తిరిగి రావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 

పంజాబ్​లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడే అప్పటి కెనడా ప్రభుత్వం భారత్​కు వ్యతిరేకంగా, టెర్రరిస్టులకు మద్దతుగా పని చేయడం ప్రారంభించింది.  భారత్  మొట్టమొదట అణుపరీక్షలు జరిపినప్పుడే అప్పటి కెనడా ప్రధాని పియరీ ట్రూడో  భారత్ పట్ల వ్యతిరేకత  వ్యక్తం చేశాడు. పోఖ్రాన్-2 అణు పరీక్షల తర్వాత కూడా కెనడా ఇదే విధమైన ధోరణి ప్రదర్శించి భారత్​తో శతృత్వ భావాన్ని కనబరిచింది.

 గతంలో  ఇందిరాగాంధీ హయాంలో ఎయిర్ ఇండియా కు చెందిన విమానంలో ఖలిస్తాన్ ఉగ్రవాది పర్మార్ నేతృత్వంలో బాంబు దాడి జరిగి,  వందలాది మంది కెనడా పౌరులు మరణించినా, అప్పటి కెనడా ప్రభుత్వం ఖలిస్తాన్ ఉగ్రవాదుల మీదున్న ప్రేమతో తమ దేశ పౌరులు మరణించినా అందుకు కారకులను శిక్షించలేక పోయింది. నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచి నేటి మోదీ ప్రభుత్వం వరకు ఖలిస్తాన్ టెర్రరిస్టులకు కేంద్రస్థానమైన కెనడా వైఖరిని విమర్శిస్తున్నా,  నాటి కెనడా ప్రధాని  పియరీ ట్రూడో నుంచి నేటి ప్రధాని  జస్టిన్ ట్రూడో వరకు భారత్ పట్ల తమ వైఖరిని మార్చుకోలేదు. 

టెర్రరిజం ప్రమాదకరం

2025లో కెనడాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో లబ్ధికోసం భారత్​పై అభాండాలు వేస్తున్న కెనడా ప్రధాని  ట్రూడోకు స్వదేశంలోనే ప్రజల మద్దతు లేదు. సామాన్య ప్రజల నుంచి మీడియా ప్రతినిధుల వరకు ట్రూడోపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఉగ్రవాదులను పెంచి పోషించడం వలన జరిగే అనర్థాల గురించి ఆలోచించకుండా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడడం కెనడా చేస్తున్న దారుణమైన తప్పిదం.  

భారత్​ను నాశనం చేయాలనే ఉన్మాదంతో దశాబ్దాల తరబడి తీవ్రవాదులను పెంచి పోషించిన  పాకిస్తాన్  నేడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఉగ్రవాదుల కోసం, అణ్వస్త్రాల కోసం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకుని, ప్రజల కనీస అవసరాలను తీర్చలేని దుస్థితిలో ప్రజలకు భిక్షాటనను వృత్తిగా ప్రసాదించింది. ఆల్ ఖైదా, తాలిబాన్ల వంటి ఉగ్రవాద సంస్థల వలన అమెరికా కూడా చేదు అనుభవాన్ని చవి చూసింది. తాలిబాన్ల దుశ్చర్యలతో  అప్ఘనిస్తాన్ ప్రజలు పడుతున్న అగచాట్ల సంగతి గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. 

కెనడా తీరు మారాలి

భారత వ్యతిరేక ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థకు ఆశ్రయమిస్తూ, భారత్ సార్వభౌమత్వాన్ని కాలరాయడానికి ప్రయత్నిస్తున్న కెనడా ప్రభుత్వం.. పాకిస్తాన్ వలె ఉగ్రవాదులకు నిలయం కావడం వలన  భవిష్య త్తులో  కెనడా  సమగ్రతకు, సార్వభౌమత్వానికి  ముప్పు వాటిల్లే  ప్రమాదముంది. ఇకనైనా మేల్కొని భారత్​తో కెనడా సఖ్యతతో మెలగాలి.  

కెనడా ప్రభుత్వం  ప్రతిపాదించిన  నూతన  వలస  విధానం వలన  కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు ఇప్పటికే అక్కడి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. భారత దేశంతో శతృత్వాన్ని పలువురు నిరసిస్తున్నారు.  ట్రూడో వైఖరి మారకపోతే,  కెనడా ప్రజలే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతారు. 

- సుంకవల్లి  సత్తిరాజు-