Kenya cricket: కెన్యా హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్

కెన్యా క్రికెట్ తమ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ దొడ్డా గణేష్‌ను నియమించింది. కెన్యా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడం నాకు గొప్ప గౌరవం అని గణేష్ తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం గణేష్‌కు ఏడాది కాంట్రాక్ట్‌ ఇచ్చారు. "ప్రపంచ కప్‌కు కెన్యా జట్టును అర్హత సాధించడమే తన మొదటి లక్ష్యమని సిక్కు యూనియన్ క్లబ్‌లో తెలిపాడు. స్వదేశంలో కెన్యా సెప్టెంబర్‌లో జరిగే ఐసీసీ ప్రపంచ కప్ ఛాలెంజ్ లీగ్‌ నుంచి గణేష్ బాధ్యతలు చేపడతాడు. ఈ టోర్నీలో పాపువా న్యూ గినియా, డెన్మార్క్, కువైట్, జెర్సీ క్రికెట్, ఖతార్ దేశాలు కూడా ఉన్నాయి.
 
రైట్ ఆర్మ్ పేసర్ అయిన గణేష్ భారత్ తరపున నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడి ఐదు వికెట్లు పడగొట్టాడు. కర్ణాటక తరపున దేశవాళీ క్రికెట్ ఆడిన అతను 104 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 29.42 సగటుతో 365 వికెట్లు తీశాడు. వీటిలో 20 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. 89 లిస్ట్ ఏ మ్యాచ్ ల్లో 27.11 సగటుతో 128 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. "కెన్యా 1996, 1999, 2003, 2007, 2011 ప్రపంచ కప్‌ లో ఆడింది. నేను వారి అంకితభావం, కృషిని చూశాను. 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఏమి జరిగిందో నాకు తెలియదు. చరిత్ర గురించి మాట్లాడదలుచుకోలేదు. నా ప్రకారం కెన్యా జట్టు ఛాంపియన్".అని గణేష్ అన్నాడు.

ఇప్పటివరకు కెన్యా నాలుగు వన్డే ప్రపంచకప్‌లు ఆడింది. 1996, 1999, 2003,2011 వరల్డ్ కప్ లో మెరిసింది. అయితే ఆ తర్వాత అసోసియేట్ దేశాల నుంచి పోటీ తట్టుకోలేక వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోతుంది. దక్షిణాఫ్రికా వేదికగా 2003 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ కు దూసుకెళ్లి అన్ని జట్లని ఆశ్చర్యపరించింది. 2027 వన్డే ప్రపంచ కప్ సైతం దక్షిణాఫ్రికా వేదికగా జరగనుండడంతో కెన్యా మరోసారి ఈ మెగా ఈవెంట్ కు అర్హత సాధించాలని ఆ దేశ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.