బ్రిగిడ్… పేదరికం తరిమితే పరుగులో గెలిచింది

ఆమెది బీద కుటుంబం. స్కూలు ఫీజు కట్టడానికి కూడా డబ్బులుండేవి కావు. ఫీజుకు డబ్బుల్లేక హైస్కూల్ చదువు మధ్యలోనే ఆపేసింది. చిన్న వయసులో పెళ్లయింది. కవలలకు తల్లయింది. అయితే  అథ్లెట్ గా రాణించాలన్న ఆమె పట్టుదలకు ఇవేమీ అడ్డు కాలేదు. ట్రాక్ మీద పరుగే జీవితంగా మారింది. చివరకు అనుకున్నది సాధించింది. మహిళల మారథాన్ లో వరల్డ్ రికార్డు ను తిరగరాసింది.

బ్రిగిడ్ కోస్గీ.. కెన్యాలోని మారుమూల పల్లెలో పుట్టిన అమ్మాయి. పేద కుటుంబం. ఏడుగురు సంతానంలో ఒకరు. స్కూలుకెళ్లాలంటే పది కిలో మీటర్లు నడవాలి. నడక ఆమెకు సమస్య కాదు.   స్కూల్​ ఫీజే ఇబ్బంది పెట్టింది.   డబ్బులుండేవి కావు. తెలిసిన వాళ్లను బతిమాలో, బామాలో వాళ్ల అమ్మ డబ్బు అప్పు తెచ్చేది. లాస్ట్​ డేట్​ రోజు హడావిడిగా ఫీజు కట్టి హమ్మయ్య అనుకునేది. ఫీజు కట్టాలన్న ప్రతిసారి ఇదే తంతు.దీంతో పైసల కోసం తల్లిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక హైస్కూల్ చదువు మధ్యలోనే మానేసింది.

ఎలిమెంటరీ స్కూల్లో ఉండగానే రన్నింగ్..

బ్రిగిడ్ ఉండే ఊళ్లో స్కూల్ లేదు. ఎక్కడో పది కిలోమీటర్ల దూరాన ఉండేది. దీంతో  ప్రతిరోజూ అంత దూరం నడవాల్సిందే. చిన్న వయసు అయినా వడివడిగా అడుగులు వేసేది. ప్రేయర్ టైమ్ కల్లా  స్కూలుకు చేరుకుంటానా ? లేదా ? అని ప్రతిరోజూ కంగారు పడేది. నడకలో స్పీడు పెంచేది. ఒకోసారి ఇక లాభం లేదనుకుని నడకకు ఫుల్ స్టాప్ పెట్టి  పరుగు అందుకునేది. ఆ పరుగు కూడా అలా ఇలా కాదు. చాలా  స్పీడుగా  పరుగెత్తేది. తనలో రన్నింగ్ టాలెంట్ ఉన్న విషయాన్ని ఎలిమెంటరీ స్కూల్లో  ఉండగానే బ్రిగిడ్ గమనించింది. అప్పటి నుంచే పరుగు మీద ఫోకస్ పెట్టింది. హైస్కూల్ కు రాగానే కోచ్ రాబర్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం మొదలెట్టింది. ఈ ట్రైనింగ్ తో  ట్రాక్ మీద చిరుతలా పరుగెత్తడానికి అవసరమైన టెక్నిక్స్  నేర్చుకుంది. హైస్కూల్లో ఉండగానే చిన్న చిన్న పరుగు పందాల్లో పాల్గొనడం మొదలెట్టింది.

పెళ్లయిన ఏడాదికి కవలలు

బ్రిగిడ్​కు చిన్న వయసులోనే పెళ్లయింది. ఫ్రెండ్ మాథ్యూ కోస్గీని ఇష్టపడి చేసుకుంది. ఏడాదికే కవలలు పుట్టారు. దీంతో ప్రాక్టీస్​కు బ్రేక్ ఇచ్చింది. మారథాన్ లో చరిత్ర సృష్టించాలన్న తపనతో 2015 లో మళ్లీ  ట్రాక్ మీదకు వచ్చింది. ప్రాక్టీస్ మొదలెట్టింది. రన్నింగ్​కు మెరుగులు దిద్దుకోవడానికి దగ్గర్లో ఉన్న  ఓ ట్రైనింగ్ క్యాంప్​లో చేరింది. ఈ క్యాంపులో చేరడం కోసం ఆమె ఇద్దరు పిల్లలను ఇంట్లోనే వదిలేసి వచ్చింది. ఈ సమయంలో భర్త మాథ్యూ  ఇచ్చిన సహకారం మరువలేనిదని చెప్పింది  బ్రిగిడ్. పిల్లలను తాను చూసుకుంటానన్న భరోసా ఇచ్చాడు మాథ్యూ.  దీంతో  రన్నింగ్ ప్రాక్టీస్ మీదే ఫుల్ టైమ్ దృష్టి పెట్టింది బ్రిగిడ్. వీకెండ్స్ కు ఇంటికి వెళ్లి పిల్లలను చూసుకుని వచ్చేది.

మేల్ అథ్లెట్స్ తో  సమానంగా ప్రాక్టీస్

బ్రిగిడ్ చేరిన ట్రైనింగ్ క్యాంపులో చాలా మంది మేల్ అథ్లెట్స్ ఉండేవారు. ట్రైనింగ్ లో భాగంగా  వాళ్లతో  ట్రాక్ మీద ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఫిమేల్ అథ్లెట్స్ తో పోలిస్తే  మేల్ అథ్లెట్స్ చాలా స్పీడుగా పరుగెత్తేవారు. వాళ్లను అందుకోవడానికి బ్రిగిడ్ కు చుక్కలు కనిపించేవి. ట్రాక్ మీద సత్తా చాటాలంటే మేల్ అథ్లెట్స్ తో సమానంగా పరుగెత్తాలని డిసైడ్ అయింది. అందుకు తగ్గట్టు ప్రాక్టీస్ మొదలెట్టింది. తొలిరోజుల్లో బాగా ఇబ్బంది పడింది. బ్రిగిడ్ రన్నింగ్ చేస్తుంటే  మేల్ అథ్లెట్స్ ఆమెను దాటి చాలా ముందుకు వెళ్లిపోయేవారు. కొన్ని రోజులకు పరిస్థితి మారింది. మగవాళ్లతో సమానంగా రన్నింగ్ చేసే స్థాయికి బ్రిగిడ్ వచ్చింది.

ఆ రోజు రానే వచ్చింది…..

బ్రిగిడ్ కోస్గీ ట్రాక్ పై  సత్తా చాటిన రోజు రానే వచ్చింది. అది ఈ నెల 13. అమెరికాలోని షికాగో నగరంలో  42.195 కిలోమీటర్ల మారథాన్ కు ఏర్పాట్లు పూర్తయ్యయి. అథ్లెట్లు అందరూ ట్రాక్ మీద రెడీ గా ఉన్నారు. స్టార్టప్ పిస్టల్ పేలింది. అథ్లెట్లు పరుగు తీయడం ప్రారంభించారు. సెకన్లు….నిమిషాలు….గంటలు గడిచాయి. అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠ. రెండు గంటల 14 నిమిషాల నాలుగు సెకన్లు గడిచాయి. బ్రిగిడ్ కోస్గీ  దూసుకొచ్చింది. ఫినిషింగ్ లైన్ దాటింది. కొత్త రికార్డు సృష్టించింది. అప్పటివరకు  బ్రిటన్ అథ్లెట్ పాలా రాడ్ క్లిఫ్ పేరుతో ఉన్న  వరల్డ్ రికార్డు బద్దలైంది.  లండన్ మారథాన్ లో 16 ఏళ్ల కిందట పాలా రాడ్ క్లిఫ్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల 15 నిమిషాల 25 సెకన్లలో పూర్తిచేసింది. అయితే రాడ్ క్లిఫ్ కంటే ఒక నిమిషం 21 సెకన్ల తక్కువ సమయంలోనే బ్రిగిడ్ కోస్గీ పూర్తి చేసి చరిత్రను తిరగరాసింది.

అమ్మ కోసం ఇల్లు కొన్నా

షికాగో మహిళల మారథాన్ లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడంతో  బ్రిగిడ్ కోస్గీ ఫుల్ హ్యాపీ. చిన్నప్పటి నుంచి తాను కన్న కల ఇప్పటికి వాస్తవమైందని చెప్పింది. ఈ హ్యాపీ మూడ్ లో  అమ్మ కు సొంతూళ్లో ఓ మంచి ఇల్లు బహుమతి ఇవ్వాలనుకున్నట్లు చెప్పింది. తన కష్టాల్లో తోడుగా ఉండి మోరల్ సపోర్ట్ ఇచ్చిన మామ్ కు ఇది చాలా చిన్న గిఫ్టే అంది బ్రిగిడ్.