నల్లగా ఉంటేఎందుకీ వివక్ష?..నాకు మళ్లీ జన్మనిస్తే తెల్లగా పుడతా: కేరళ చీఫ్​ సెక్రటరీ శారదా మురళీధరన్

నల్లగా ఉంటేఎందుకీ వివక్ష?..నాకు మళ్లీ జన్మనిస్తే తెల్లగా పుడతా: కేరళ చీఫ్​ సెక్రటరీ శారదా మురళీధరన్
  • కేరళ చీఫ్​ సెక్రటరీ శారదా మురళీధరన్​ ఫేస్​బుక్​ పోస్ట్​ వైరల్​
  • సమాజంలో చిన్నప్పటినుంచీ వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నా
  • నాకు మళ్లీ జన్మనిస్తే తెల్లగా పుడతానని మా అమ్మతో అన్నా
  • నలుపు రంగు సిగ్గుపడాల్సిన విషయం కాదని కామెంట్స్​

తిరువనంతపురం: సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న రంగు, లింగ వివక్షపై కేరళ చీఫ్​ సెక్రటరీ శారదా మురళీధరన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తన కలర్​ కారణంగా చిన్పప్పటినుంచీ వివక్ష ఎదుర్కొన్నానని తెలిపారు. 1990 బ్యాచ్‌‌కు చెందిన ఐఏఎస్‌‌ అధికారిణి అయిన శారద  ఇటీవలే కేరళ చీఫ్‌‌ సెక్రటరీగా నియమితులయ్యారు. తన భర్త తర్వాత ఆ స్థానంలో ఆమె చేరగా ఈ దంపతుల చర్మ రంగులపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వెలువడ్డాయి. దీంతో నెటిజన్ల అభిప్రాయాలపై శారద స్పందించారు. బ్లాక్ గా​ ఉండడం సిగ్గుపడాల్సిన విషయం కాదని పేర్కొన్నారు.  కొందరు ఈ రంగు మంచిది కాదన్నట్టు మాట్లాడుతున్నారని, నిజానికి నలుపును ఎందుకు అవమానించాలి అని అడిగారు. ఇది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యమని, వర్షానికి ముందు కనిపించే వాగ్దానం.. సాయంత్రానికి సూచిక అని పేర్కొన్నారు. ‘చర్మ రంగుపై ఓ పోస్ట్​ పెట్టాను.  దానికి వచ్చిన కామెంట్లతో కంగారుపడి వెంటనే తొలగించా. అయితే నేను పేర్కొన్న అంశాలు చర్చించాల్సినవేనని బంధుమిత్రులు చెప్పడంతో మళ్లీ షేర్ చేశా’ అని డిలీట్ చేసిన మాటలను పంచుకున్నారు.

తక్కువగా భావించుకున్నా..

చిన్నతనంలో తన స్కిన్​ కలర్​ చూసుకొని తనకు తాను తక్కువగా భావించుకున్నట్టు శారదా మురళీధరన్​ తెలిపారు. ‘‘నా చర్మ రంగు... చిన్నప్పుడే నేను పెద్ద మాటలు మాట్లాడేలా చేసింది. మళ్లీ నన్ను నీ గర్భంలోకి తీసుకెళ్లి తెల్లగా, అందంగా తీసుకురాగలవా? అని మా అమ్మని అడిగా. ఆ కలర్​ ప్రభావం నాపై 50 ఏండ్లపాటు కొనసాగింది. బ్లాక్​అంటే విలువ లేదని అనుకుని తెలుపు పట్ల అట్రాక్ట్​ అయ్యా. కానీ నలుపు కూడా అందమైనదని, అద్భుతమైనదని నా పిల్లలు తెలిసేలా చేశారు. ఇప్పుడు నేను కూడా నలుపును ఇష్టపడుతున్నా” అని ఆమె ఫేస్​బుక్​లో రాసుకొచ్చారు. ఈ వివక్షను ఎదుర్కోని వారికి ఇది చిన్న విషయంగానే కనిపిస్తుందని కానీ.. కలర్​తో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నవారికి ఇది చాలా పెద్ద విషయమని పేర్కొన్నారు. కాగా, శారదా మురళీధరన్​ పోస్ట్ పై చాలామంది ప్రశంసలతో ముంచెత్తారు. శారదా మురళీధరన్‌‌ పోస్టులో రాసిన ప్రతి మాట మనస్సుని హత్తుకునేలా ఉందని కేరళ అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్‌‌ అన్నారు. తన తల్లి కూడా నలుపురంగులోనే ఉందని, ఇది చర్చకు రావాలని కోరుకున్నా అని ఆయన పోస్ట్‌‌లో పేర్కొన్నారు. నలుపు రంగుపై శారద పెట్టిన పోస్ట్​ను కేరళ 
విద్యాశాఖ మంత్రి వీ శివన్​కుట్టి ప్రశంసించారు.