- కాంగ్రెస్ పార్టీ లౌకికవాద ముసుగు బట్టబయలయింది : పినరయి విజయన్
తిరువనంతపురం : వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ లౌకికవాద ముసుగును పూర్తిగా బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. గురువారం ఆయన ఫేస్‌బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మన దేశానికి జమాతే ఇస్లామీ గురించి తెలియనిది కాదు. ఆ సంస్థ సిద్ధాంతం ప్రజాస్వామ్య విలువలతో సరిపోతుందా? ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు.
జమాతే ఇస్లామీ దేశానికి, ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వదని, దేశ పాలనా నిర్మాణాన్ని విస్మరిస్తుందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో జమాతే ఇస్లామీ చాలా కాలంగా ఎన్నికలను వ్యతిరేకిస్తోందని, బలమైన మతతత్వ స్థానాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వారు కాశ్మీర్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. వయనాడ్‌లోని జమాతే ఇస్లామీ.. కశ్మీర్‌లోని జమాతే ఇస్లామీకి భిన్నమైనదని వాదిస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా భావజాలం అలాగే ఉందని,-- ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు మద్దతివ్వాలని భావిస్తున్నారని విజయన్ పేర్కొన్నారు.