కేరళ సీఎం పినరయి విజయన్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. నవంబర్ 1న సాయంత్రం రాష్ట్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నవంబర్ 1న సాయంత్రం కంట్రోల్ రూంకు ఫోన్ చేసి బెదిరించారని... ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఫోన్ నంబర్‌పై 118(బి), 120(ఓ) కింద మ్యూజియం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తిని ఎర్నాకులంకు చెందిన 12 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. ఈ వింత పరిణామంతో ఖంగుతున్న పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడారు. అయితే తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఫోన్‌లో ఆడుకుంటున్నాడని.. అనుకోకుండా కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చిందని తెలిపారు. అయితే తల్లిదండ్రుల వివరణతో సంతృప్తి చెందని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గతంలోనూ పినరయి విజయన్ కు బెదిరింపులు వచ్చాయి. ఆయనను చంపేస్తామని లేఖలు వచ్చాయి. 2018లో దుబాయ్ కు చెందిన ఓ ఎన్ఆర్ఐ పినరయి విజయన్ ను చంపేస్తామని వీడియో రిలీజ్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. 2022లో కేరళకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పీసీ జార్జ్ ను లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన భార్య ఉషా జార్జ్ మీడియా ముందే చంపుతానని బెదిరించారు. పినరయి విజయన్ ను తుపాకితో కాల్చి చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చారు.