యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణలపై పాలక్కాడ్ జిల్లా కోర్టు(కేరళ) నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనలకు సంబంధించిన కేసులో వీరు విచారణకు హాజరుకాకపోవడంతో పాలక్కాడ్ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇద్దరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు.
ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 15న జరగనుంది. ఈ కేసులో దివ్య ఫార్మాసిటీని మొదటి నిందితుడిగా, ఆచార్య బాలకృష్ణ రెండో నిందితుడిగా, బాబా రామ్‌దేవ్‌ను మూడో నిందితుడిగా పేర్కొన్నారు.
ALSO READ | రాష్ట్రపతి భవన్లో మొట్టమొదటి పెళ్లి.. ఎవరా అదృష్టవంతులు..?
పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన దివ్య ఫార్మసీపై ప్రకటనల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. దీనిపై ఫిబ్రవరి 01న కోర్టు ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలను న్యాయస్థానం ఆదేశించింది. వీరు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఇద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు.
గతంలో సుప్రీంకోర్టు చేత చీవాట్లు..
గతంలో అల్లోపతి వంటి ఆధునిక ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించినందుకుగానూ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటిసారి అటువంటి ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించింది. అవేమి పట్టించుకోని పతంజలి సంస్థ.. తిరిగి ప్రకటనలు ప్రచురించడంతో కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారం తీవ్రతరం కావడంతో రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలు బహిరంగ క్షమాపణలు చెప్పారు. దాంతో, సుప్రీంకోర్టు ధిక్కార కేసులను మూసివేసింది.