పుణె: రంజీ ట్రోఫీలో కేరళ రెండోసారి సెమీఫైనల్ చేరుకుంది. జమ్మూకశ్మీర్, కేరళ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయ్యింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క రన్ ఆధిక్యం కారణంగా కేరళ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 2018–19 తర్వాత కేరళ సెమీస్‌కు చేరడం ఇది రెండోసారి. జమ్మూ ఇచ్చిన 399 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 100/2తో బుధవారం ఐదో రోజు బరిలోకి దిగిన కేరళ మ్యాచ్ చివరకు 126 ఓవర్లలో 295/6 స్కోరు చేసింది.
మహ్మద్ అజారుద్దీన్ (67 నాటౌట్), సల్మాన్ నిజర్ (44 నాటౌట్) ఏడో వికెట్‌కు 115 రన్స్ జోడించి మ్యాచ్‌ను డ్రా చేశారు. సచిన్ బేబీ (48), అక్షయ్ చంద్రన్ (48) రాణించారు. యుధ్వీర్ సింగ్, సాహిల్ లోట్రా, అబిద్ ముస్తాక్ రెండేసి వికెట్లు తీశారు. జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 280 రన్స్ చేయగా, కేరళ 281 రన్స్ సాధించింది. నిజర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ నెల 17 నుంచి జరిగే సెమీస్‌లో కేరళ.. గుజరాత్‌తో తలపడుతుంది.