‘ఈ బాధను తట్టుకోవడం కంటే చచ్చిపోతే బాగుండు’ అని ఇకపై అస్సలు అనుకోవద్దు.. పాలియేటివ్ కేర్ ఉందిగా..!

‘ఈ బాధను తట్టుకోవడం కంటే చచ్చిపోతే బాగుండు’ అని ఇకపై అస్సలు అనుకోవద్దు.. పాలియేటివ్ కేర్ ఉందిగా..!

కడుపు నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య, క్యాన్సర్​ వచ్చిందని తెలిసిన రోజే ఉరేసుకున్న యువకుడు.. ఇలాంటి వార్తలు రెగ్యులర్​గా చూస్తూనే ఉంటాం. వాస్తవానికి వాళ్లవి పరిష్కారం లేని సమస్యలు కాదు. కానీ.. ఆ సమస్య వచ్చినప్పుడు బాధను తట్టుకోలేక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు డిప్రెషన్​లోకి వెళ్లిపోతుంటారు. అలాంటి వాళ్ల బాధలు తీర్చేందుకు కేరళలోని ఒక గ్రామం ప్రత్యేకంగా పాలియేటివ్​ కేర్​ సర్వీసులను మొదలుపెట్టింది. ఆ ఒక్క గ్రామమే కాదు.. కేరళలోని చాలా ప్రాంతాల్లో ఈ సర్వీసులు అందుతున్నాయి. ఇంతకీ ఈ పాలియేటివ్​ కేర్​ అంటే ఏంటి? ఇది అక్కడ ఎలా మొదలైంది?

ఇప్పుడు వైద్య రంగంలో టెక్నాలజీ బాగా పెరిగింది. హార్ట్​ ట్రాన్స్​ప్లాంటేషన్​ నుంచి రకరకాల కీమో థెరపీల వరకు అన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. అందుకే మనిషి ఆయుష్షు కూడా పెరుగుతోంది. రోగి ప్రాణాలను కాపాడేందుకు ట్రీట్​మెంట్లు చేసినప్పుటికీ ఆ తర్వాత రోగి పడే బాధ, నొప్పిని తగ్గించడానికి సరైన విధానాలు అందుబాటులో లేవు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ల పరిస్థితి కూడా ఇదే. అందువల్ల చాలామంది చివరి రోజుల్లో హాస్పిటల్​లో చేరి ఐసీయూలో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. చుట్టూ మానిటర్ల మధ్యలో తమకు ఇష్టమైన వాళ్లకు దూరంగా గడపాల్సి వస్తోంది. అయితే.. తమ గ్రామంలో ఎవరికీ ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో కేరళలోని వెంగనూర్‌‌‌‌ గ్రామ పంచాయతీ ఒక నిర్ణయం తీసుకుంది. 

అన్నీ ఇంటికే.. 

కేరళలోని తిరువనంతపురం శివార్లలోని వెల్లయని సరస్సు బ్యాక్​ వాటర్​కు ఆనుకుని ఉన్న వెంగనూర్‌‌‌‌ గ్రామంలో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికీ పాలియేటివ్​ కేర్​ అందిస్తున్నారు. ఈ సేవలు పూర్తిగా గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలోనే అందుతున్నాయి. పూర్తి ఖర్చుని గ్రామ పంచాయతీ భరిస్తుంది. ఇక్కడ హోమ్​ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే పాలియేటివ్ కేర్ యూనిట్లలో ప్రత్యేకంగా ట్రైనింగ్​ తీసుకున్న ఫిజియో థెరపిస్ట్​, నర్సులు ఇంటికే వచ్చి ట్రీట్​మెంట్​ చేస్తారు. దీనివల్ల చివరి దశలో కుటుంబీకులతో గడిపే అవకాశం దొరుకుతుంది. 

అంతేకాదు.. వెంగనూరులో ఎవరు మంచాన పడినా జీవితాంతం వాళ్లకు అవసరమయ్యే వీల్‌‌‌‌చైర్లు, ఆక్సిజన్ సపోర్ట్ లాంటివి పంచాయతీ నుంచే అందిస్తున్నారు. క్యాన్సర్, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధులు, హెచ్‌‌‌‌ఐవీ లాంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కూడా జీవితకాలం సర్వీసులు అందిస్తున్నారు. ప్రతిరోజూ రోగుల ఇంటికి వెళ్లి ఎగ్జామిన్​ చేస్తారు. ఏదైనా పెద్ద సమస్య ఉంటేనే హాస్పిటల్​కు తీసుకెళ్తారు. రోగితో ప్రేమగా మాట్లాడతారు. కౌన్సెలింగ్​ ఇస్తారు. 

తాలిపరంబలో 17 ఏళ్లుగా

శోభనది కేరళలోని తాలిపరంబకు దగ్గర్లోని కూవోడ్ గ్రామం. ఆమె పదిహేడు సంవత్సరాలుగా పాలియేటివ్​ కేర్ సేవలను ఉచితంగా అందిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు రోగుల ఇళ్లకు వెళ్తుంది. తన కోసం ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ల బాధలను తెలుసుకుంటుంది. అలా రాత్రి 9 గంటల వరకు తిరుగుతూనే ఉంటుంది. ఇదే ఆమె డైలీ రొటీన్​. ఈ సర్వీసులు అందించడానికి ‘సంజీవని సంత్వనవీడు’ అనే ట్రస్టు కూడా ఏర్పాటు చేసింది. తన తమ్ముడి భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ల కుటుంబం అనుభవించిన బాధ ఇంకెవరికీ ఉండకూడదని అప్పటివరకు చేస్తున్న టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి ఈ ట్రస్ట్‌‌‌‌ పెట్టింది శోభన.  

కేరళలోనే 

కేరళలో ఈ రెండు గ్రామాల్లోనే కాకుండా చాలా ప్రాంతాల్లో పాలియేటివ్​ కేర్​ సర్వీసులు అందుతున్నాయి. కేరళలో మొత్తం 1,700కు పైగా పాలియేటివ్ కేర్ సెంటర్లు ఉన్నాయి.  వాటిలో 1,100 కేంద్రాలను ప్రభుత్వం నడుపుతోంది. 400 నుంచి 450 వరకు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి. 80  నుంచి 90 కేంద్రాలను రాజకీయ పార్టీలు నడుపుతున్నాయి. కొన్ని ఇన్-పేషెంట్ సర్వీసులు, మరికొన్ని హోమ్​ కేర్​ సర్వీసులు ఇస్తున్నాయి. 

వీటిల్లో డాక్టర్లతోపాటు చాలామంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. అంతేకాదు.. దేశంలో ఎక్కువ పాలియేటివ్ కేర్​ సర్వీసులు అందిస్తున్న రాష్ట్రం కూడా కేరళనే. అందులోనూ కోజికోడ్‌‌‌‌ జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో పాలియేటివ్ కేర్ సెంటర్లు  ఉన్నాయి. పాలియేటివ్ కేర్ మోడల్‌‌‌‌కు మూలాలు కూడా అక్కడే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పాలియేటివ్ కేర్ ఇంతలా డెవలప్​​ కావడానికి కారణం.. కోజికోడ్​కు చెందిన ఎంఆర్​ రాజగోపాల్​. ఆయనే అక్కడివాళ్లకు అవగాహన కల్పించారు. 

ఇలా మొదలైంది

రాజ​గోపాల్ పొరుగింట్లో క్యాన్సర్ పేషెంట్​ ఉండేవాడు. నొప్పి భరించలేక రోజూ ఏడ్చేవాడు. అప్పటికే మెడిసిన్​ చదువుతున్న రాజ​గోపాల్​ దగ్గరకి అతని కుటుంబ సభ్యులు వెళ్లి, ‘బాధను తగ్గించేందుకు నువ్వేమైనా చేయగలవా?’ అని అడిగారు. కానీ.. అతను కూడా ఏమీ చేయలేకపోయాడు. 

మెడిసిన్​ పూర్తి చేసిన తర్వాత రాజ​గోపాల్​ మత్తు వైద్య నిపుణుడు (అనస్తీషియన్)గా మంచి పేరు తెచ్చుకున్నాడు.1980ల చివరలో కోజికోడ్‌‌‌‌లోని ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో అనస్తీషియాలజీ విభాగం అధిపతిగా పనిచేసేవాడు. నర్వ్‌‌‌‌ బ్లాకర్స్​ నొప్పితో బాధపడుతున్న రోగులకు ట్రీట్​మెంట్​ చేసేవాడు. ఇలాంటి నొప్పిని తగ్గించడానికి నరాలకు ఇంజెక్షన్లు చేస్తుంటారు. ఇదే సమస్యతో ఒక పేషెంట్ రాజగోపాల్​ దగ్గరకు వచ్చాడు. 42 సంవత్సరాల వయస్సు ఉన్న అతను ఒక కాలేజీలో  ప్రొఫెసర్​గా పనిచేసేవాడు. అతనికి నాలుక క్యాన్సర్‌‌‌‌ కూడా ఉంది. 

రాజగోపాల్​ అతనికి ఇంజెక్షన్​ ఇచ్చి పంపించాడు. అతను మరుసటి మళ్లీ  రోజు వచ్చి నొప్పి కాస్త తగ్గిందని చెప్పాడు. తిరిగి వెళ్లేముందు ‘‘మళ్లీ ఎప్పుడు కలవమంటారు?” అని అడిగాడు. అందుకు రాజగోపాల్​ అతనికి నొప్పి పూర్తిగా తగ్గుతుందని, మళ్లీ రాదనే ఉద్దేశంతో ‘‘ మళ్లీ రావలసిన అవసరం లేదు” అని చెప్పాడు. కానీ.. ఆ ప్రొఫెసర్​ దాన్ని మరోలా అర్థం చేసుకున్నాడు. అతనికి నయం చేయలేని వ్యాధి ఉందని, ఇక నుంచి ప్రతి రోజూ ఆ నొప్పిని భరించాల్సిందేనని అనుకున్నాడు. అప్పటికే అతనికి క్యాన్సర్​ ఉందని తెలుసు. కాబట్టి అది కూడా నయం కాదేమో అనుకున్నాడు. దాంతో అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. 

పాలియేటివ్​ కేర్​లో ట్రైనింగ్​

ఈ రెండు సంఘటనలు రాజ్ గోపాల్​ని బాగా బాధపెట్టాయి. ప్రొఫెసర్​ భయాలను, నొప్పిని పూర్తిగా తగ్గించగలిగితే ఇంకొన్నాళ్లు తనవాళ్లతో కలిసి హాయిగా బతికేవాడు. అందుకే అలాంటి సర్వీసులను అందించే పాలియేటివ్​ కేర్ ​మీద స్టడీ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత 1993లో  డాక్టర్ సురేష్ కుమార్​తో కలిసి కోజికోడ్‌‌‌‌లో పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీని స్థాపించాడు.

 కుమార్​ యూకేలో పాలియేటివ్ కేర్‌‌‌‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. అదే టైంలో పాలియేటివ్​ కేర్ ​​ గురించి మరింత తెలుసుకోవడానికి యూకేలో రాజ గోపాల్​10 వారాల పాటు ట్రైనింగ్​ తీసుకున్నాడు. మొదట్లో ప్రభుత్వ మెడికల్​ కాలేజీ వరండాలోని 12 అడుగుల చిన్న గదిలో సొసైటీని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దాని ద్వారా కొన్ని వేల మందికి సేవలు అందుతున్నాయి. 

రాజగోపాల్, కుమార్ కలిసి 1998లో ఎన్జీవోల సపోర్ట్‌‌‌‌తో కేరళలో కమ్యూనిటీ బేస్డ్, వాలంటీర్- డ్రైవెన్ పాలియేటివ్ కేర్ ప్రోగ్రామ్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ఐదు సంవత్సరాల తరువాత 2003లో రాజగోపాల్, కుమార్ మెడికల్​ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ పాలియేటివ్ మెడిసిన్‌‌‌‌ను కూడా స్థాపించారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా పాలియేటివ్​ కేర్​ మీద శ్రద్ధ పెట్టింది. ఇది కేవలం వైద్య సమస్య మాత్రమే కాదు, సామాజిక సమస్య  కూడా అని గుర్తించింది. 

అందుకే కేరళలో స్థానిక ప్రభుత్వ సంస్థలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పాలియేటివ్ కేర్ అందించడాన్ని తమ బాధ్యతగా తీసుకున్నాయి. 2008లో కేరళ ప్రభుత్వం పాలియేటివ్ కేర్ పాలసీని తీసుకొచ్చింది. అటువంటి విధానాన్ని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం అదే. 2012లో మహారాష్ట్ర, 2016లో కర్ణాటకలో, ఈ మధ్యే తెలంగాణలో కూడా పాలియేటివ్​ కేర్​ మీద ప్రత్యేక విధానాలు రూపొందించారు. ఇప్పుడు మన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పాలియేటివ్​ కేర్​ యూనిట్లు ఉన్నాయి. 

ఫాదర్ ఆఫ్ పాలియేటివ్ కేర్ 

ఎంఆర్ రాజగోపాల్ భారతీయ పాలియేటివ్ కేర్​లో చేసిన కృషి వల్ల అతన్ని ‘ఫాదర్ ఆఫ్ పాలియేటివ్ కేర్ ఇన్ ఇండియా’ అని పిలుస్తుంటారు. 2018లో రాజగోపాల్​ను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2018, 2023 లలో నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అయ్యాడు.

పాలియేటివ్​ కేర్​ అంటే.. 

రకరకాల కారణాలతో నొప్పితో బాధపడేవాళ్లను రెగ్యులర్​గా చూస్తూనే ఉంటాం. ఆ నొప్పులు పేషెంట్లకు నరకాన్ని చూపిస్తాయి. ‘ఈ బాధను తట్టుకోవడం కంటే చనిపోతే బాగుండు’ అనిపిస్తుంటుంది. ఆ నొప్పికి మందు లేదా? అంటే.. ఉంది. అదే పాలియేటివ్​ కేర్(సాంత్వన వైద్యం) దీర్ఘకాలిక సమస్యలు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడేవాళ్ల నొప్పిని తగ్గించే వైద్య విధానమే పాలియేటివ్​ కేర్. ఇందులో నొప్పికి మందులు ఇవ్వడమే కాదు.. రోగి బాధని అర్థం చేసుకుని సాంత్వన కలిగేలా చేస్తారు. పేషెంట్​తోపాటు, కుటుంబీకులకు కౌన్సెలింగ్​ ఇస్తారు. లైఫ్​ని ఎలా లీడ్​ చేయాలో చెప్తారు.