
ఇటీవల కాలంలో పునర్వినియోగం లేని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో తాగునీటి వినియోగం, నీళ్ల అమ్మకాలు విరివిగా పెరిగాయి. దీనివలన ప్లాస్టిక్ ఘనవ్యర్థాలు అధికంగా ఏర్పడటంతోపాటు అనేక పర్యావరణ, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కేరళ హైకోర్టు 7 మార్చి 2025న కేరళ రాష్ట్రవ్యాప్తంగా వివాహ, విందు కార్యక్రమాల్లో, అధికారిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఉపయోగించవద్దని మౌఖికంగా సలహా ఇచ్చింది.
గాజు సీసాలను ఉపయోగించాలని, పునర్వినియోగించలేని ప్లాస్టిక్‌ను తొలగించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. పాలీఇథిలిన్ టెరిప్తాలేట్ (పి.ఇ.టి.) అనే రసాయనం(మోనోమర్)తో తయారుచేసిన బాటిల్స్‌లో వాటర్ ప్యాక్ చేయడం జరుగుతోంది. భారతదేశంలో ఏటా14 లక్షల టన్నులకు పైగా పి.ఇ.టి. ప్లాస్టిక్‌తో తయారుచేసిన బాటిల్స్‌లో వాటర్ ప్యాక్ అవుతుంది.
ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం అనారోగ్యం
2024లో USD 3.84 బిలియన్ల విలువైన భారతీయ బాటిల్ వాటర్ మార్కెట్ విలువ 2030 నాటికి 14.7% వృద్ధి చెందుతుందని ఓ అంచనా. దీనికి వేగవంతమైన జనాభా పెరుగుదల, తగినంత కుళాయి నీటి సరఫరా లేకపోవడం, బాటిల్ వాటర్ సులభంగా అందుబాటులో ఉండటం మొదలైన అంశాలు కారణమవుతున్నాయి. ఈ నీటిలో మినరల్స్ 40 మిల్లీగ్రాములు/ లీటరు కన్నా తక్కువగా ఉంటాయి. అంటే దాదాపుగా మినరల్స్ ఉండవు. తాగేనీటిలో 100 నుంచి 300 మిల్లీగ్రాములు/లీటరు వరకు మినరల్స్ ఉండాలి. దుకాణాల్లో విక్రయించే బాటిల్ వాటర్‌లో గతంలో అంచనా వేసిన దానికంటే 10 నుంచి 100 రెట్లు ఎక్కువ నానో సైజు ప్లాస్టిక్ కణాలు ఉన్నాయి అని పరిశోధకులు కనుగొన్నారు.
నానో సైజు ప్లాస్టిక్‌లు జీర్ణవ్యవస్థ లేదా ఊపిరితిత్తుల కణజాలాల ద్వారా రక్తప్రవాహంలోకి కలిసిపోతాయి. దీంతో శరీరమంతా కణాలలోకి హానికరమైన సింథటిక్ రసాయనాలు పంపిణీ అవుతాయి. ఒక లీటరు బాటిల్ వాటర్ ఏడు రకాల ప్లాస్టిక్ లను కలిగి ఉండి సగటున 2,40,000 ప్లాస్టిక్ కణాలను కలిగి ఉంటుంది. వీటిలో 90% నానోప్లాస్టిక్‌లుగా గుర్తించారు. మిగిలినవి మైక్రోప్లాస్టిక్‌లు అని అధ్యయనం తెలిపింది. 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండేవి మైక్రో ప్లాస్టిక్‌లు అంటారు.
పేపర్ ప్లేట్స్, కప్పులతో ముప్పు
ఇటీవల కాలంలో వివాహ కార్యక్రమాల్లో, అధికారిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌తో పాటు, ప్లాస్టిక్ కోటింగ్ వేసిన పేపర్ ప్లేట్స్ ఉపయోగిస్తున్నారు. టీ, కాఫీ వంటి వేడి ద్రవాలు తాగటానికి అవి లీక్ కాకుండా ప్లాస్టిక్ కోటింగ్ వేసిన కప్పులను, కర్రీలను ప్యాక్ చేయటానికి సైతం పునర్వినియోగం లేని ప్లాస్టిక్‌ను విరివిగా వాడుతున్నారు. వీటికి వాడేది ప్లాస్టిక్ థర్మోప్లాస్టిక్ పాలిమర్. అధిక ఉష్ణోగ్రతలకి గురైనప్పుడు ఇది విచ్ఛిన్నమవుతుంది. వేడి ఆహార పదార్థాలకు ప్లాస్టిక్ మెత్తపడి మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతాయి. అవి ఆహారంలో కలిసిపోయే అవకాశం ఉన్నది. అంటే ఆహారంతోపాటుగా క్యాన్సర్ కారకమైన మైక్రోప్లాస్టిక్‌లు శరీరంలోనికి ప్రవేశించి అది క్యాన్సర్‌కు కారణం అవుతుంది.
ఐఐటీ ఖరగ్‌పూర్ వారు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్లాస్టిక్ కప్పుల నుంచి కేవలం మూడు కప్పుల టీ లేదా కాఫీని తీసుకోవడం వల్ల దాదాపు 75,000 మైక్రోప్లాస్టిక్ కణాలు శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఈ కణాలు, పల్లాడియం, క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత పదార్థాలతోపాటు హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు, క్యాన్సర్, నాడీ సంబంధిత రుగ్మతలు వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ ప్రక్రియలో పానీయం ఉష్ణోగ్రత కీలక పాత్ర పోషిస్తుంది. 85–-90 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉన్న వేడి ద్రవాలు కేవలం 15 నిమిషాల్లోనే ప్లాస్టిక్ లైనింగ్‌ల విచ్ఛిన్నానికి కారణమవుతాయని, విడుదలయ్యే మైక్రోప్లాస్టిక్‌ల పరిమాణాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న మైక్రో ప్లాస్టిక్‌లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, పేపర్ టీ కప్స్, పేపర్ ప్లేట్స్ మొదలగు వాటి ద్వారా పర్యావరణంలోకి విడుదల అయినప్పుడు అది భూమి, నీటి పర్యావరణ వ్యవస్థలలో మైక్రోప్లాస్టిక్‌ల కాలుష్యానికి దారి తీస్తుంది. ఇది సముద్ర సంబంధమైన ఆవాసాలకు సైతం విఘాతం కలిగిస్తుంది. ఈ మైక్రోప్లాస్టిక్‌లు మానవులలో అలెర్జీలు, క్యాన్సర్, మధుమేహానికి దారితీసే విష పదార్థాలను కలిగి ఉంటాయి.
పాత పద్ధతులే ఆరోగ్యానికి రక్ష
ఆన్లైన్ ఫుడ్ సరఫరా చేసేవారు ఆహారాన్ని నలుపు రంగు ప్లాస్టిక్ కంటైనర్లలో సరఫరా చేస్తారు. ఈ నలుపు రంగు ప్లాస్టిక్ కంటైనర్లు ‘బిస్ ఫినోల్-A’ ‘ఫ్తాలెట్స్’ వంటి రసాయనాలను కలిగి ఉంటాయి. అవి ఆహారంలో కలిసిపోయి శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఈ రసాయనాలు క్యాన్సర్ కారకాలు. ఈ ప్లాస్టిక్ కంటైనర్లను వినియోగించి ఆహారం మైక్రోవేవ్ ఒవెన్‌లో వేడి చేయటం ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం. పాతకాలంలో వలె వివాహ కార్యక్రమాల్లో, అధికారిక కార్యక్రమాల్లో విస్తరాకులలో లేదా అరటి ఆకులలో ఆహారాన్ని వడ్డించాలి. నీళ్లను, టీ, కాఫీ వంటి వేడి ద్రవాలను, తినే ఆహార పదార్థాలకు స్టీల్ లేదా గాజు లేదా కాపర్ లేదా బ్రాస్ లేదా మట్టితో తయారుచేసిన వస్తువులను ఉపయోగించాలి.
దీంతో పర్యావరణానికి మేలు జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడవు. కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం నీళ్లను ఇతర ఆహార పదార్థాలను ప్లాస్టిక్ సంబంధిత వస్తువులలో సరఫరా చేయడాన్ని, వాడటాన్ని పూర్తిగా నిషేధించాలి.
డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్