మీ కోడి కూత ఆపకపోతే.. కొరికేస్తా.. కొరికేస్తా : పోలీస్ పంచాయితీ ఇలా..

మీ కోడి కూత ఆపకపోతే.. కొరికేస్తా.. కొరికేస్తా : పోలీస్ పంచాయితీ ఇలా..

ఒకప్పుడు కోడికూతతో ఊరంతా నిద్ర లేచేది..పల్లెల్లో అయితే కోడికూతే అలారం లాగా భావించి పొలం పనులకు బయలుదేరేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కోడి కూతకు నిద్రలేచేటోళ్లు కనుమరుగైపోయారనే చెప్పచ్చు. ఇక సిటీల్లో అయితే.. కోడి కూసే సమయానికి నిద్రపోయేవారే ఎక్కువ శాతం ఉన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రోజూ తెల్లవారుజామునే కోడి కూత వేస్తోంటే నిద్ర డిస్టర్బ్ అవ్వడం సహజం కదా.. కేరళలో ఓ వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది..రోజూ తెల్లవారుజామున 3 గంటలకు పక్కింటి కోడి కూత వల్ల తన నిద్రకు భంగం కలుగుతోందని పోలీసులను ఆశ్రయించాడు సదరు వ్యక్తి... ఆ తర్వాత ఏమైంది, పోలీసులు ఈ పంచాయితీని ఎలా సెటిల్ చేశారు ఇప్పుడు చూద్దాం.

కేరళలోని పతనంతిట్టలోని పల్లికల్ గ్రామానికి చెందిన రాధాకృష్ణ కురూప్ అనే వృద్ధుడు తమ పక్కింట్లో ఉండే కోడి కూత వల్ల తన నిద్రకు భంగం కలుగుతోందంటూ పోలీసులను ఆశ్రయించాడు. రోజూ తెల్లవారుజామునే 3 గంటలకు పక్కింట్లోని కోడి ఎడతెగకుండా కూయడం వల్ల తనకు నిద్ర పట్టడం కష్టమై.. ప్రశాంతతకు భంగం కలుగుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కురూప్.తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని.. తనకు సరైన ఆహారం కూడా అందటం లేదని.. దీనికి తోడు పక్కింటి కోడి కూత వల్ల ప్రశాంతమైన నిద్ర కూడా ఉండటం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు కురూప్.

Also Read :- పుణ్యస్నానానికి వెళ్లి.. ల్యాప్టాప్తో కుస్తీలు

కురూప్ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న అడూర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు.. దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా కురూప్, కోడి యజమాని కుమార్ ను పిలిపించి మాట్లాడి.. ఆ తరువాత ఇద్దరి ఇళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో కుమార్ తన కోడిని మెడపై ఉంచడమే సమస్యకు కారణంగా గుర్తించారు పోలీసులు. కోడి మెడపై ఉంచకుండా ఇంటికి దక్షిణ భాగంలో ఉంచాలని.. 14 రోజుల్లో కోడి స్థావరాన్ని మార్చాలని ఆదేశించారు పోలీసులు.

మొత్తానికి ఆస్తి తగాదాలు, భూ వివాదాల లాగా ఇలాంటి వింత సమస్యలకు కూడా పోలీసులు పంచాయితీ దాకా వెళ్లడం విడ్డూరం. మారుతున్న మనిషి జీవన విధానాన్ని అనుసరించి ప్రకృతి కూడా అడ్జస్ట్ అయ్యే రోజు వస్తుందేమో చూడాలి.